ఉర్దూ అకాడమీ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు అప్పగించడం తగదు…
- మైనారిటీ శాఖ జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.20ను తక్షణమే రద్దు చేయాలి
- రాష్ట్ర మైనారిటీ సంఘం అధ్యక్షుడు ఎండీ యాకూబ్ పాషా డిమాండ్
- ముఖ్యమంత్రి, మైనారిటీ శాఖ మంత్రి, ప్రధాన కార్యదర్శికి లేఖలు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ఉర్దూ అకాడమీకి చెందిన కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థకు 30 సంవత్సరాల పాటు లీజుకు అప్పగించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ జారీ చేసిన జీఓ ఎంఎస్ నెం.20ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని తెలంగాణ రాష్ట్ర మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ మహమ్మద్ యాకూబ్ పాషా డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం దర్గా హుస్సేన్ షా వలీ గ్రామంలోని సర్వే నెం.29లో ఉన్న 1.04 ఎకరాల (5,220 చదరపు గజాలు) తెలంగాణ ఉర్దూ అకాడమీ భూమిని హైదరాబాద్కు చెందిన ఎన్.ఎన్. ఇన్ఫ్రా అండ్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు 30 సంవత్సరాల లీజుకు అప్పగించేందుకు మైనారిటీ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని ఆయన తెలిపారు.
ఈ భూమిలో ఉర్దూ ఘర్, షాదీఖానా, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నప్పటికీ, కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కేవలం వార్షిక లీజు రుసుము రూ.5,220కే ప్రైవేట్ సంస్థకు కేటాయించడం పలు అనుమానాలకు తావిస్తోందని యాకూబ్ పాషా పేర్కొన్నారు. ప్రజా ప్రకటన జారీ చేయకుండా, పోటీ టెండర్లు లేదా బిడ్లను ఆహ్వానించకుండా లీజు మంజూరు చేయడం పారదర్శకతకు విరుద్ధమని ఆరోపించారు.
తెలంగాణ ఉర్దూ అకాడమీ విద్య, సాంస్కృతిక రంగం, ఉర్దూ భాష, సాహిత్య అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థ అని, అలాంటి సంస్థ ఆస్తులను ప్రైవేట్ సంస్థలకు దీర్ఘకాలిక లీజుకు ఇవ్వడం అకాడమీ అసలు లక్ష్యాలకు, ప్రజా ప్రయోజనాలకు విరుద్ధమని ఆయన అన్నారు.అందువల్ల జీఓ ఎంఎస్ నెం.20ను ప్రభుత్వం వెంటనే రద్దు చేసి, ఉర్దూ అకాడమీ ఆస్తులను పరిరక్షించేలా చర్యలు చేపట్టాలని యాకూబ్ పాషా ప్రభుత్వాన్ని కోరారు.
ఈ విషయమై రాష్ట్ర ముఖ్యమంత్రి, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, ప్రభూత్వ ప్రధాన కార్యదర్శికి లేఖలు పంపినట్లు తెలిపారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి జీఓను ఉపసంహరించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని జీఓను వెంటనే రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
