క్రీడలతో స్నేహభావం, మానసిక ఉల్లాసం..

అమరావతి ఛాంపియన్‌షిప్–2026 క్రీడా పోటీలు…
ప్రారంభించిన పెడన ఎమ్మెల్యే


గూడూరు – ఆంధ్రప్రభ : అమరావతి ఛాంపియన్‌షిప్–2026 కార్యక్రమంలో భాగంగా పెడన నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను గూడూరు జడ్పీహెచ్‌ఎస్ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ… క్రీడలతో స్నేహభావం, మానసిక ఉల్లాసం పెంపొందుతాయన్నారు. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు, జట్టు స్ఫూర్తిని పెంపొందించే గొప్ప సాధనమని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఇలాంటి పోటీలు తమ ప్రతిభను చాటుకునే ఉత్తమ వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు.

ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. పెడన నియోజకవర్గంలోని వివిధ గ్రామ పంచాయతీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఈ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. క్రీడా ప్రాంగణం విద్యార్థుల సందడితో కళకళలాడగా, పోటీల్లో ప్రతిభ కనబర్చిన క్రీడాకారులను ఎమ్మెల్యే అభినందించారు.