ఇంటింటికీ టీడీపీ.. ప్రచారమే కాదు.. రాజకీయ పునర్వ్యవస్థీకరణ
ప్రజల గడపలో ప్రభుత్వం.. బూత్ స్థాయిలో పార్టీ బలోపేతం
మంత్రాలయం–ఆలూరుపై ప్రత్యేక దృష్టి
స్థానిక ఎన్నికలే తొలి లక్ష్యం
45 రోజుల మహా కార్యాచరణతో క్షేత్రస్థాయిలో టీడీపీ కొత్త వ్యూహం
కర్నూలు బ్యూరో, జులై 28 (ఆంధ్రప్రభ): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల గడప వద్దకే తీసుకెళ్లడం, ప్రభుత్వంపై ప్రజల అభిప్రాయాన్ని నేరుగా తెలుసుకోవడం, గ్రామ–వార్డు–బూత్ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులను సిద్ధం చేయడం వంటి బహుముఖ లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. మొత్తం 45 రోజులపాటు కొనసాగనున్న ఈ కార్యాచరణను అధికార పార్టీ సాధారణ ప్రచార కార్యక్రమంగా కాకుండా, భవిష్యత్ రాజకీయాలకు పునాది వేసే సంస్థాగత ఉద్యమంగా చేపట్టడం విశేషం.

టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇన్చార్జులు, గ్రామ, మండల, జిల్లా నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజల సమస్యలను నమోదు చేస్తూ, ప్రభుత్వ సేవలపై అభిప్రాయాలను సేకరిస్తున్నారు.
కేవలం ప్రచారం కాదు.. ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం
గతంలో ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలపై ప్రజలకు సరైన సమాచారం చేరకపోవడం వల్ల రాజకీయంగా నష్టపోయామని టీడీపీ అంతర్గతంగా విశ్లేషించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం చేసిన పనులను ప్రజలు తెలుసుకున్నప్పుడే రాజకీయంగా ప్రయోజనం ఉంటుందనే భావనతో ఈసారి ప్రతి లబ్ధిదారుడిని నేరుగా కలవాలని పార్టీ నిర్ణయించింది.

ప్రతి ఇంటిని సందర్శిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల కలిగిన ప్రయోజనాలను వివరించడం, ఇంకా అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకోవడం, స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం ఈ కార్యక్రమంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి.
రెండేళ్ల పాలనకు ప్రజల వద్ద మార్కుల సేకరణ
ఈ కార్యక్రమాన్ని రాజకీయ విశ్లేషకులు ఒక రకంగా ప్రభుత్వ పనితీరుపై సామాజిక, రాజకీయ ఆడిట్‌గా అభివర్ణిస్తున్నారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలపై ప్రజల స్పందన ఎలా ఉంది, ఏ శాఖ పనితీరుపై అసంతృప్తి ఉంది, ప్రజలు ఇంకా ఏం ఆశిస్తున్నారు, స్థానిక ప్రజాప్రతినిధులపై ప్రజల అభిప్రాయం ఏమిటి వంటి అంశాలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకునే ప్రయత్నంగా ఈ కార్యక్రమాన్ని భావిస్తున్నారు.
ప్రజల నుంచి సేకరించిన సమాచారాన్ని గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో విశ్లేషించి పార్టీ అధిష్ఠానానికి నివేదించే విధానాన్ని కూడా రూపొందించినట్లు సమాచారం.

కర్నూలుపై ప్రత్యేక దృష్టి
ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ కార్యక్రమం రాజకీయంగా మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా కూటమి ఘనవిజయం సాధించినప్పటికీ మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో వైసీపీ విజయం సాధించడం టీడీపీ అధిష్ఠానాన్ని ఆలోచింపజేసింది.
ఆ రెండు నియోజకవర్గాల్లో గ్రామస్థాయిలో పార్టీ బలహీనతలు, బూత్ కమిటీల పనితీరు, ఓటర్లతో సంబంధాలు, స్థానిక నాయకత్వం వంటి అంశాలపై ఇప్పటికే పలుమార్లు సమీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని అక్కడ ప్రత్యేకంగా అమలు చేసి గ్రామస్థాయి నుంచి పార్టీని తిరిగి బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.
స్థానిక ఎన్నికలే అసలు లక్ష్యం
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశమున్న నేపథ్యంలో టీడీపీ ఇప్పటికే ఎన్నికల మోడ్‌లోకి వెళ్లినట్లు కనిపిస్తోంది. ప్రతి గ్రామం, ప్రతి వార్డు, ప్రతి బూత్‌లో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయడం, బూత్ కమిటీలను చైతన్యవంతం చేయడం, కొత్త కార్యకర్తలను గుర్తించడం, మహిళలు, యువతకు బాధ్యతలు అప్పగించడం, పార్టీ అనుబంధ సంఘాలను చురుకుగా మార్చడం వంటి అంశాలకు ఈ కార్యక్రమంలో ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేకంగా మంత్రాలయం, ఆలూరు నియోజకవర్గాల్లో స్థానిక ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా రాజకీయంగా పాగా వేయాలనే లక్ష్యంతో పార్టీ ముందుకు సాగుతోంది.
చంద్రబాబు పర్యటనలతో పెరిగిన రాజకీయ చైతన్యం
గత రెండు నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలో పలుమార్లు పర్యటించారు. ఆస్పరిలో సంజీవని కార్యక్రమం ప్రారంభం, ఓర్వకల్లు పారిశ్రామిక పెట్టుబడులు, సాగునీటి ప్రాజెక్టుల సమీక్షలు, జిల్లా అధికారులతో సమావేశాలు, అభివృద్ధి పనుల పరిశీలన వంటి కార్యక్రమాల ద్వారా ప్రభుత్వం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టిందనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.
జిల్లాలో చేపట్టిన పారిశ్రామిక పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, సాగునీటి ప్రాజెక్టులు, రహదారుల అభివృద్ధి, వైద్య, విద్యా రంగాల్లో చేపట్టిన చర్యలను ఈ కార్యక్రమంలో ప్రధానంగా వివరిస్తున్నారు.
సంక్షేమ పథకాలే ప్రధాన అస్త్రం
ఈ కార్యక్రమంలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి ప్రధాన పథకాన్ని ప్రజలకు వివరించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.ముఖ్యంగా…తల్లికి వందనం,ఎన్టీఆర్ భరోసా,అన్న క్యాంటీన్లు, ఉచిత ఇసుక విధానం,రైతు సంక్షేమ కార్యక్రమాలు,సాగునీటి ప్రాజెక్టులు,మహిళా సాధికారత,యువత ఉపాధి కార్యక్రమాలు,పారిశ్రామిక పెట్టుబడులు,విద్య, వైద్య రంగ సంస్కరణలు,గ్రామీణ అభివృద్ధి పనులు,వంటి అంశాలను ఇంటింటికీ వెళ్లి ప్రజలకు వివరిస్తున్నారు.
ప్రజల సమస్యలే ప్రధాన అజెండా
ప్రచారం చేయడమే కాకుండా ప్రజల సమస్యలను నేరుగా నమోదు చేయడంపై కూడా పార్టీ దృష్టి పెట్టింది. గ్రామాల్లో… తాగునీటి సమస్యలు,సాగునీటి ఇబ్బందులు,రోడ్ల దుస్థితి, విద్యుత్ సమస్యలు, పెన్షన్లు,రేషన్ రెవెన్యూ సమస్యలు,గృహాల మంజూరు,ఆరోగ్య సేవలు,ఉపాధి అవకాశాలువంటి అంశాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు.
కర్నూలు జిల్లాలో ఘన ప్రారంభం
ఉమ్మడి కర్నూలు జిల్లాలో తొలి రోజు కార్యక్రమం ఉత్సాహంగా సాగింది.పత్తికొండ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు.సి. బెళగల్ మండలంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి నేతృత్వంలో గ్రామాల్లో విస్తృతంగా కార్యక్రమం నిర్వహించారు..పాణ్యం నియోజకవర్గంలోని బ్రాహ్మణదొడ్డి గ్రామంలో ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి నాయకత్వంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం చేపట్టి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు.తుగ్గలి మండలంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ తుగ్గలి నాగేంద్ర ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమయ్యారు.ఇవే కాకుండా ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, కర్నూలు, బనగానపల్లె, డోన్, ఆలూరు, మంత్రాలయం తదితర నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
పార్టీ పునర్వ్యవస్థీకరణకు ఇదే వేదిక
ఎన్నికల తర్వాత కొంత నెమ్మదించిన పార్టీ కార్యకలాపాలకు మళ్లీ ఊపు తీసుకురావడమే కాకుండా గ్రామ, వార్డు, బూత్ కమిటీలను పునర్వ్యవస్థీకరించడం, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించడం, యువత, మహిళలను పార్టీలో చేర్చుకోవడం, కొత్త నాయకత్వాన్ని తయారు చేయడం వంటి లక్ష్యాలతో కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోనున్నారు.
ప్రతిపక్ష విమర్శలకు ప్రజల మధ్యే సమాధానం
ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు సభల ద్వారా కాకుండా ప్రజల గడప వద్దే సమాధానం చెప్పాలని టీడీపీ వ్యూహం రచించింది. ప్రభుత్వం చేసిన పనులను లెక్కలతో వివరించడం, లబ్ధిదారులను ప్రత్యక్షంగా కలవడం, సంక్షేమ పథకాల ప్రభావాన్ని ప్రజలే చెప్పేలా చేయడం ద్వారా ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత పెంచాలని పార్టీ భావిస్తోంది.
