పోచమ్మ ఆలయంలో చోరీ కలకలం
హుండీతో పాటు బంగారం, వెండి ఆభరణాలు అపహరణ
సీసీ కెమెరా డీవీఆర్ కూడా ఎత్తుకెళ్లిన దొంగలు.. తెలిసిన వారి పనేనని అనుమానం
ఖానాపురం , ఆంధ్రప్రభ: ఖానాపురం గ్రామంలోని శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయంలో అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలోని హుండీతో పాటు అమ్మవారికి అలంకరించిన బంగారు, వెండి ఆభరణాలు, ఇతర విలువైన సామగ్రిని అపహరించారు. అంతేకాకుండా ఆధారాలు లభించకుండా ఉండేందుకు ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల డీవీఆర్‌ను కూడా తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటనలో సుమారు రూ.20 లక్షలకు పైగా విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై ఆలయ కమిటీ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, ఆలయ నిర్మాణం, విలువైన వస్తువుల వివరాలు తెలిసిన వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆలయంలోని చోరీ ఘటనతో భక్తులు, గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది.
