గడపగడపకు మంత్రి కొల్లు రవీంద్ర
- ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో దృష్టి
- 34వ డివిజన్లో ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకం!
- సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యల హామీ
మచిలీపట్నం, ఆంధ్రప్రభ: ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటికి శాశ్వత పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రాష్ట్ర గనులు, భూగర్భ, మైనింగ్, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర సోమవారం మచిలీపట్నం నగరంలోని 34వ డివిజన్లో నిర్వహించిన ‘గడపగడపకు టీడీపీ’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు, అవసరాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై స్వయంగా ఆరా తీశారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటూ సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు చేపడతామని భరోసా ఇచ్చారు.
ఇంటింటికీ వెళ్లి సమస్యలపై ఆరా..
మంత్రి కొల్లు రవీంద్ర ప్రతి కుటుంబాన్ని కలిసి తాగునీటి సరఫరా, పారిశుధ్యం, మురుగునీటి కాలువలు, అంతర్గత రహదారులు, వీధి దీపాలు, డ్రైనేజీ, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను నిశితంగా విని వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాధాన్యం..
ప్రజల సమస్యలు ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి పేర్కొన్నారు. ప్రతి సమస్యను నమోదు చేసి సంబంధిత శాఖల అధికారులతో సమన్వయం చేసి నిర్ణీత గడువులో పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం..
తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమానికి నిరంతరం కట్టుబడి ఉందని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు.
ప్రజలకు అందుబాటులోనే ప్రజాప్రతినిధులు..
ప్రజా ప్రతినిధులు ఎన్నికల సమయంలో మాత్రమే కాకుండా ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. గడపగడపకు వెళ్లడం ద్వారా ప్రజలతో ప్రత్యక్ష అనుబంధం పెరుగుతుందని, సమస్యలను క్షేత్రస్థాయిలో గుర్తించి వేగంగా పరిష్కరించేందుకు అవకాశం కలుగుతుందని అన్నారు. ప్రజల సూచనలు అభివృద్ధి కార్యక్రమాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
అభివృద్ధి – సంక్షేమమే కూటమి ప్రభుత్వ ఎజెండా..
మచిలీపట్నం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధితో పాటు తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపరచడం, చెట్లను నాటడం, విద్య, వైద్యం వంటి ప్రజల ప్రాథమిక అవసరాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు. భవ్య బందరు నగరుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రజల సహకారంతో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత, వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా మంత్రి దృష్టికి తీసుకురావడంతో పలువురు సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల వద్దకే వెళ్లి సమస్యలు తెలుసుకునే ఈ తరహా కార్యక్రమాలు ప్రభుత్వంపై విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర మైనార్టీ సెల్ డైరెక్టర్ హసీమ్ బేగ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ కుంచె నాని, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు లోగిశెట్టి స్వామి, అక్కు మహతి రాజా పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.
