ఆగస్టు 2న మంచిర్యాలలో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు
కార్మిక సమస్యలపై పోరాటానికి కార్యాచరణ
క్యాతన్‌పల్లి, ఆంధ్రప్రభ: కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి, నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఆగస్టు 2న మంచిర్యాల జిల్లాలో ఏఐటీయూసీ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. అదే సందర్భంగా రామకృష్ణాపూర్ పట్టణ కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
రామకృష్ణాపూర్ ఏఐటీయూసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు అక్బర్ అలీ, జిల్లా కార్యదర్శి మేకల దాసు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నాటి 44 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తీసుకురావడం వల్ల కార్మికుల హక్కులు, కనీస వేతనాలు, సామాజిక భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
సింగరేణితో పాటు బ్యాంకింగ్ రంగం సహా అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు.
నిరుద్యోగం, కాంట్రాక్టు వ్యవస్థ వంటి సమస్యలపై కూడా మహాసభల్లో తీర్మానాలు చేసి ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. వంద సంవత్సరాల చరిత్ర కలిగిన ఏఐటీయూసీ ఎప్పుడూ కార్మికుల పక్షాన ఉంటుందని స్పష్టం చేశారు.
సింగరేణి, ఇతర సంస్థల కార్మికులు, సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మిట్టపల్లి పౌల్, సాంబయ్య, మొండిజెట్టి మల్లయ్య, పలు గనుల పిట్ సెక్రటరీలు హరి, రామకృష్ణ, ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
