గోదావరి కరకట్ట సర్వేను అడ్డుకున్న రైతులు

పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేపట్టాలని డిమాండ్

మంగపేట, ఆంధ్రప్రభ: గోదావరి కరకట్ట నిర్మాణ పనుల్లో భాగంగా ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండానే సర్వే నిర్వహించడాన్ని నిరసిస్తూ మంగపేట మండల కేంద్రంలోని గోదావరి కరకట్ట సమీపంలో రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. అధికారుల తీరుకు నిరసనగా సర్వే పనులను అడ్డుకున్నారు.

ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ.. మొదట 35 మీటర్ల మేర సర్వే చేసిన అధికారులు ప్రస్తుతం అదనంగా మరో 25 మీటర్లు పెంచి భూములను సర్వే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

భూములు కోల్పోతున్న తమకు ఇంతవరకు ఎలాంటి పరిహారం అందించకుండానే పనులు ముందుకు తీసుకెళ్లడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

చిన్న, సన్నకారు రైతులకు అర ఎకరం, ఎకరం లోపు భూములే జీవనాధారమని, అవి కూడా కోల్పోతే తమ కుటుంబాల జీవనం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు.

వెంటనే సర్వే పనులను నిలిపివేసి, భూములు కోల్పోతున్న ప్రతి రైతుకు తగిన నష్టపరిహారం చెల్లించిన తర్వాతే కరకట్ట పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

భూములకు పరిహారం అందించే వరకు సర్వే పనులను కొనసాగించనివ్వబోమని రైతులు స్పష్టం చేశారు. అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు.

నష్టపరిహారం చెల్లించకుండా కరకట్ట నిర్మాణ పనులు చేపడితే సహించేది లేదని, పరిహారం ఇచ్చిన తర్వాతే నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బాధిత రైతులు కందగట్ల లక్ష్మీనారాయణ, మాను పెళ్లి రాజేష్, పెందోట సతీష్, పెందుట సత్యనారాయణ, కోడం రాజు, కందగట్ల రాజమౌళి, కందగట్ల రాజన్న, సాయిని దిలీప్ తదితరులు పాల్గొన్నారు.