విత్తన మేళాలను సద్వినియోగం చేసుకోండి..
నాణ్యమైన విత్తనాలతో అధిక దిగుబడులు సాధించండి
ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
నల్లబెల్లి, ఆంధ్రప్రభ : ఖరీఫ్ సీజన్లో రైతులు విత్తన మేళాలను సద్వినియోగం చేసుకుని ధ్రువీకరించిన నాణ్యమైన విత్తనాలను వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సూచించారు. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరి సాగుకు బదులుగా ఆరుతడి పంటలైన కందులు, పెసర్లు వంటి ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.
సోమవారం నల్లబెల్లి మండలం మేడేపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విత్తన మేళాను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన ధ్రువీకరించిన విత్తనాల స్టాళ్లను పరిశీలించారు. వివిధ రకాల విత్తనాల నాణ్యత, అందుబాటు, రైతులకు సరఫరా విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రైతులు గుర్తింపు పొందిన సంస్థలు, ప్రభుత్వ అనుమతి పొందిన డీలర్ల వద్ద మాత్రమే ధ్రువీకరించిన విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు. విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, సంచులపై ఉన్న గడువు తేదీ, మొలక శాతం, బ్యాచ్ నంబర్, ధ్రువీకరణ వివరాలను పరిశీలించిన తర్వాతే వినియోగించాలని తెలిపారు.
నాసిరకం విత్తనాల బారిన పడకుండా ఉండేందుకు ఈ జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే పరిహారం పొందేందుకు కొనుగోలు బిల్లులు ఉపయోగపడతాయని చెప్పారు.
అనిశ్చిత వర్షాల పరిస్థితుల్లో నీటి వినియోగాన్ని తగ్గించే ఆరుతడి పంటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కలెక్టర్ సూచించారు. కందులు, పెసర్లు వంటి పంటలు తక్కువ నీటితోనే మంచి దిగుబడిని అందించడంతో పాటు రైతులకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటాయని పేర్కొన్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు ప్రతి రైతుకు పంటల ఎంపిక, విత్తనాల వినియోగం, శాస్త్రీయ సాగు విధానాలు, పంటల యాజమాన్యంపై నిరంతరం అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ శాస్త్రీయ విధానంలో సాగు చేపడితే దిగుబడులు పెరగడంతో పాటు సాగు వ్యయం కూడా తగ్గుతుందని రైతులకు వివరించారు.
ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ డీహెచ్ఎస్వో శ్రీనివాస్, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, నర్సంపేట వ్యవసాయ అధికారి బొమ్మెన శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి రజిత బన్న, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు రంజిత్, రాకేష్, శివకుమార్, త్రివేణి, మేడేపల్లి గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, రైతులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
