యువకుడిపై కత్తులతో దాడి

యువకుడిపై కత్తులతో దాడి

  • కాటారం మండలంలో పట్టపగలే ఘటన..
  • తీవ్రంగా గాయపడిన గణేష్
  • భూపాలపల్లి ఆస్పత్రికి తరలింపు

కాటారం, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలో పట్టపగలే ఓ యువకుడిపై గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ధన్వాడ–గుమ్మల్లపల్లి గ్రామాల మధ్య మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానికుల కథనం ప్రకారం.. ఓడిపిలవంచ గ్రామానికి చెందిన చిగురు గణేష్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. దాడి సమయంలో గణేష్ కేకలు వేయడంతో సమీపంలో ఉన్న రైతులు అక్కడికి చేరుకున్నారు. రైతులు వస్తున్నట్లు గమనించిన దుండగులు వెంటనే అక్కడి నుంచి పరారయ్యారు.

ఈ దాడిలో గణేష్ ఛాతిపై తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే అంబులెన్స్‌కు సమాచారం అందించగా, అతడిని భూపాలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. దాడికి గల కారణాలపై ఆరా తీస్తూ, పరారీలో ఉన్న దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కాటారం ఎస్సై గడ్డం శ్రీనివాస్ తెలిపారు.