Polavaram | బురదలో భారీ పాదముద్రలు!

  • స్థానికుల‌ను అల‌ర్ట్ చేసిన అట‌వీ శాఖ అధికారులు

పోలవరం, ఆంధ్ర‌ప్ర‌భ‌: ఏలూరు జిల్లా పోలవరం మండలం ఎల్‌ఎన్‌డీ పేట గ్రామంలో మరోసారి పులి సంచారం అనుమానాలు స్థానికులను ఆందోళనకు గురిచేశాయి. గ్రామానికి సమీపంలోని బురద ప్రాంతంలో పెద్ద పిల్లి జాతికి చెందిన పాదముద్రలు కనిపించడంతో గ్రామస్థులు భయాందోళనలకు గురయ్యారు.

విషయం తెలుసుకున్న గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. అవి నిజంగా పులికి చెందినవేనా, లేక ఇతర అడవి జంతువుకు చెందినవేనా అనే విషయాన్ని అధికారులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా అడవికి ఆనుకుని ఉన్న ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. పశువులను మేపేందుకు వెళ్లే రైతులు, కూలీలు తగిన జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు.
పులి సంచారానికి సంబంధించిన పూర్తి వివరాలు, పాదముద్రలపై అటవీ శాఖ అధికారుల అధికారిక నిర్ధారణ వెలువడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.