హైదరాబాద్ – తాను కూడా కక్ష సాధింపులకు పాల్పడితే కెటిఆర్ ఎప్పుడో జైలు వెళ్లేవారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.. అందర్ని కలుపుకుని ముందుకు సాగాలనే తన అభిమతమని, అందుకే విపక్ష సహకారాన్ని పదపదే కోరుతున్నానని అన్నారు.. బడ్జెట్ ఆమోద తీర్మానంపై ఆయన మాట్లాడుతూ, గతంలో తనపై జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించారు. కొన్ని వ్యక్తులు సలహాలు, సూచనలు ఇవ్వడానికే సిద్ధంగా ఉంటారని, కానీ వాటిని పాటించాల్సిన బాధ్యతను అనుసరించరని విమర్శించారు. తనపై రాజకీయ కక్ష సాధింపుతో వ్యవహరించారని, అందువల్లే చంచల్‌గూడ జైల్లో అత్యంత కఠినమైన నక్సలైట్ సెల్‌లో 16 రోజులు ఉంచారని తెలిపారు. జైల్లో ఉన్న సమయంలో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదని, సెల్‌లో ట్యూబ్‌లైట్ సరిగా పనిచేయక పోవడంతో అక్కడ బల్లులు, పురుగులు వేధించేవని వివరించారు.
లైట్ ఆపాలని కోరినప్పటికీ పై నుంచి ఆదేశాలొచ్చాయని తిరస్కరించారని చెప్పారు.ఆ కఠిన పరిస్థితులను అధిగమించి, పరిపాలనను కోపం ప్రదర్శించకుండా ముందుకు తీసుకెళ్తున్నానని తెలిపారు. తన ప్రమాణం స్వీకరించిన రోజు ఆసుపత్రిలో చేర్చాడు దేవుడు.. తన బిడ్డ లగ్గానికి కూడా అభ్యంతరం తెలిపారని గుర్తు చేశారు. కండిషన్ బెయిల్ మీద విడుదలై వచ్చానని, కానీ రాజకీయ కక్ష సాధింపులో తాను ఎప్పుడూ దిగజారలేదని స్పష్టంగా చెప్పారు.
గత ప్రభుత్వం తన కుటుంబంపై ఎలా వ్యవహరించిందో అందరికీ తెలుసని, తాను కక్ష సాధించాలనుకుంటే వారి కుటుంబం మొత్తం జైలులో ఉండేదని పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ కుటుంబం కోసం జైల్లో డబుల్ బెడ్ రూమ్ కట్టిస్తానని హామీ ఇచ్చినప్పటికీ, ఆ హామీ కూడా నెరవేరలేదని ఎద్దేవా చేశారు. తనను కించపరిచేందుకు, తనపై బూతులు మాట్లాడించేందుకు కొన్ని వ్యక్తులను ఉపయోగించినా, తాను మౌనంగా ఉండిపోయానని సీఎం తెలిపారు.
విచక్షణాధికారం ఉపయోగిస్తే…
ముఖ్యమంత్రి విచక్షణాధికారులు ఉపయోగిస్తే మీరు ఒక్కరైనా బయట ఉండేవారా..? అని ఆయన ప్రశ్నించారు. గత ప్రభుత్వం ఎన్నికల ముందు ఏకమొత్తంలో రూ.లక్ష రుణమాఫీ చేస్తామన్నారని, ఎన్నిలయ్యాక రుణమాఫీకి ఐదేళ్ల సమయం పట్టిందని మండిపడ్డారు రేవంత్ రెడ్డి. రెండోసారి రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చి.. నాలుగేళ్లు చేయలేదన్నారు. పదేళ్లలో 21 లక్షల మంది రైతులకు 16,908 కోట్లు రుణమాఫీ చేశారు. మేం 25 లక్షల మంది రైతులకు రూ.20 వేల కోట్లు రెండు లక్షల చొప్పున రుణమాఫీ చేశామని ఆయన తెలిపారు. రైతుబంధు ఎన్నికల కోడ్‌ను అడ్డం పెట్టుకొని వారు పారిపోయారని, వారు ఎగ్గొట్టిన డబ్బును తాను సీఎం అయ్యాక చెల్లించాను అని ఆయన పేర్కొన్నారు. మొదటి విడత రూ.7625 కోట్లు నేను చెల్లించా అని తెలిపారు.
మేం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా పథకం కింద రూ.12 వేల కోట్లు చెల్లించామన్నారు. వాళ్లు వరి పండించి రూ.4500కు అమ్మకున్నారని, పేద రైతులకు మాత్రం వరేస్తే ఉరే అని ప్రచారం చేశారన్నారు. మేం వరి వేయమని చెప్పి, బోనస్ కూడా ఇచ్చామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉచిత కరెంట్ కనిపెట్టిందే కాంగ్రెస్ అని, మీరు పదేళ్లు చేయలేని పనులు పది నెలల్లో చేసి చూపామని కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారన్నారు. కడుపులో కత్తులు పెట్టుకొని మాట్లాడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వారి హయాంలో అకాల వర్షాలకు ఏనాడు నష్టపరిహారం ఇవ్వలేదని, మేం నష్టపరిహారం చెల్లించామన్నారు. కష్టపడి పనిచేస్తున్నానని ప్రతిపక్ష నాయకుడు చెప్పొచ్చు కదా అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి నాలుగు రకాలుగా అప్పు చేసుకునే అవకాశం ఉంటుందని, మూడు రకాల అప్పులు కలిపి తెలంగాణ ఏర్పడే నాటికి 90 వేల 160 కోట్ల అప్పు ఉండేదన్నారు. 1 డిసెంబర్ 2023 నాటి అప్పు రూ. 6,69,257 కోట్లు అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.
మీరంతా జైలుకు పోవడం ఖాయం…
మీరు కట్టిన ప్రాజెక్టులు కూలిపోయినా నీళ్లు ఇవ్వడానికి ఉందని బీఆర్‌ఎస్ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం నుంచి నీరు తీసుకోకపోయినా పంటలు పండించాం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రజలను తప్పుదారి పట్టించకండని, లగచర్లలో జరిగిందంటున్నారు.. మరి ఆనాడు మల్లన్నసాగర్‌లో జరిగింది ఏంటి అని సీఎం రేవంత్ ప్రశ్నించారు. కొండపోచమ్మ సాగర్ నుంచి మీ ఫాంహౌజ్‌కు నీరు తీసుకెళ్లారా లేదా.. ప్రాజెక్టులు కట్టిందే మీ ఫామ్‌హౌజ్‌ల కోసం అని సీఎం రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ప్రాజెక్ట్‌ల దగ్గర ఎవరికి ఫాంహౌజ్‌లు ఉన్నాయో నిజనిర్ధారణ కమిటీ వేద్దామా.? అని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు. దుర్మార్గమైన ఆలోచన మీకు ఉంటుంది.. మాకెందుకు ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూమి కోల్పోయినప్పుడు రైతులకు బాధ ఉంటుంది.. లగచర్లలో అసైన్డ్ భూములకు కూడా 20 లక్షలు ఇచ్చాం అని రేవంత్ రెడ్డి తెలిపారు.
అధికారులను చంపండి అని మీ మాజీ ఎమ్మెల్యే చెప్పింది పబ్లిక్ డొమైన్‌లో ఉందని, కేటీఆర్, హరీష్ చూసుకుంటారని మీ మాజీ ఎమ్మెల్యే అన్నారని రేవంత్ పేర్కొన్నారు. మీరు అత్యంత అవినీతి చేసిన ప్రాజెక్ట్ మీద కమిషన్ విచారణ జరుగుతోందని, విద్యుత్ కొనుగోళ్లపై కమిషన్ నివేదిక ఇచ్చిందన్నారు. తొందర్లోనే వీరు జైలుకు వెళ్తారు.. వచ్చే సభలో కాళేశ్వరం విచారణ నివేదికపై చర్చ పెడదాం అని ఆయన అన్నారు. టెండర్ ప్రక్రియలోనే వీళ్లు జైలుకు పోతారని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కమీషన్ల కోసం ప్రాజెక్టులు రీడిజైన్ చేశారన్నారు. తెలంగాణ జాతిపిత అని చెప్పుకునే కేసీఆర్‌ను కామారెడ్డిలో ప్రజలు ఓడించారన్నారు. నేను ఓడిపోయినా.. నిన్ను కూడా ఓడిస్తా అని కేసీఆర్‌కు అప్పుడే చెప్పానన్నారు సీఎం రేవంత్. ఏడాదిలో 2 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చానన్నారు. ఇది నా సమర్థత అని ఆయన రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేటీఆర్ గుంటూరులో చదివిన తెలివితేటలు ఇక్కడ చూపాలనుకుంటున్నాడు అంటూ సీఎం విమర్శనాస్త్రాలు సంధించారు.