బీఆర్ఎస్లో ఐక్యతే విజయానికి బాట
టేకుమట్ల నాయకులు
పార్టీ నిర్ణయాలే శిరోధార్యం..
గండ్ర వెంకటరమణారెడ్డి నాయకత్వంలో ముందుకు సాగాలని పిలుపు
టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తల ఐక్యతే ప్రధాన బలమని టేకుమట్ల మండల బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. అధికార కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పార్టీ శ్రేణులు సమిష్టిగా పోరాడుతున్న సమయంలో అంతర్గత విభేదాలు కార్యకర్తలను అయోమయానికి గురిచేయడం పార్టీకి నష్టమని ఆందోళన వ్యక్తం చేశారు.
పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్చార్జిగా గండ్ర వెంకటరమణారెడ్డిని నియమించారని, ఆయన నాయకత్వంలోనే పార్టీ కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
ఇటీవల భూపాలపల్లిలో మాజీ స్పీకర్, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు సిరికొండ మధుసూదనాచారి కుమారుడు సిరికొండ ప్రశాంత్ నిర్వహించిన సమావేశంలో చేసిన వ్యాఖ్యలు కార్యకర్తల్లో గందరగోళానికి దారితీశాయని తెలిపారు.
పార్టీ అధిష్టానం నిర్ణయం వెలువడకముందే ఎమ్మెల్యే అభ్యర్థిపై ప్రకటనలు చేయడం వల్ల కార్యకర్తలు అయోమయానికి గురవడమే కాకుండా ప్రత్యర్థి పార్టీలకు అవకాశం కల్పించే పరిస్థితి ఏర్పడుతుందని నాయకులు పేర్కొన్నారు. వ్యక్తుల కంటే పార్టీ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇవ్వాలని, పార్టీ నిర్ణయాలను గౌరవిస్తూ అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.
భూపాలపల్లి నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పార్టీ అధిష్టానం ఆదేశాలకు అనుగుణంగా గండ్ర వెంకటరమణారెడ్డి నాయకత్వంలో పనిచేయాలని టేకుమట్ల మండల బీఆర్ఎస్ నాయకులు పిలుపునిచ్చారు.
పార్టీ కోసం నిబద్ధతతో పనిచేస్తున్న కార్యకర్తలకు భరోసా కల్పిస్తూ, భూపాలపల్లి రాజకీయాలపై స్పష్టత ఇవ్వాలని కేసీఆర్, కేటీఆర్‌లను విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శులు సట్ల రవి గౌడ్, ఆకునూరి తిరుపతి, మండల ముఖ్య నాయకులు బందెల నరేష్, పింగిలి వెంకటేశ్వరరెడ్డి, సర్పంచ్‌లు మాట్ల శ్రీనివాస్, రామ్ ఉమా దేవేందర్, టౌన్ అధ్యక్షుడు నిమ్మల స్వామి, మాజీ సర్పంచ్ పొన్నం చెంద్రయ్య, గువ్వాడి లక్ష్మణ్, ఎండీ అఫ్జల్, లాడే రవీందర్, ఎలవేన నర్సయ్య, బందెల శ్రీనివాస్, మామిండ్ల ఎల్లస్వామి, అకోజు వరదాచారి, బస్సా శ్రీనివాస్, మారపెల్లి రాయకొమరు, మచ్చ రాజయ్య, వేమ వీరన్న, మచ్చ సరోత్తం, ఎండీ అక్రమ్, నానవేణి కుమారస్వామి, బొమ్మ పరమేష్, రాజేష్‌తో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
