ఆయిల్ ఫామ్ సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం
తక్కువ నీటితో సాగయ్యే పంటలపై దృష్టి పెట్టాలని సూచన
బిక్కనూర్, ఆంధ్రప్రభ : ఆయిల్ ఫామ్ తోటల సాగుపై రైతులు దృష్టి సారించాలని కామారెడ్డి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి సూచించారు.
సోమవారం మండలంలోని కాచాపూర్ గ్రామంలో గ్రామ ఉప సర్పంచ్ దశరథంకు చెందిన రెండు ఎకరాల వ్యవసాయ భూమిలో ఆయిల్ ఫామ్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు సరిగా కురవడం లేదని, ఈ పరిస్థితుల్లో తక్కువ నీటితో సాగయ్యే పంటలపై రైతులు దృష్టి పెట్టాలని అన్నారు.
ఆయిల్ ఫామ్ తోటల సాగు రైతులకు మంచి ఆదాయాన్ని అందిస్తుందని తెలిపారు. అంతర పంటల సాగుకు కూడా ఈ పంట ఎంతో అనుకూలంగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పాలమాకుల జ్యోతి సంతోష్ గౌడ్, ఉప సర్పంచ్ దశరథం, కామారెడ్డి డివిజన్ ఉద్యానవన అధికారి సుమన్, హెచ్‌ఈఓ బాపూరెడ్డి, హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ కంపెనీ సీనియర్ మేనేజర్లు శ్రీనివాస్ గౌడ్, ప్రమోద్, క్లస్టర్ మేనేజర్ హేమాకుమార్, క్లస్టర్ అధికారి సత్యనారాయణ, అరుణ్ కుమార్, పలువురు రైతులు పాల్గొన్నారు.
