కాంగ్రెస్ సీనియర్ నేతకు ఎమ్మెల్యే ఘన నివాళి

వాజేడు, ఆంధ్రప్రభ: ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దంతులూరి విశ్వనాథ ప్రసాదరాజు (60) గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సందర్శించి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి, పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

దంతులూరి విశ్వనాథ ప్రసాదరాజు మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలను సమన్వయం చేస్తూ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి విశేషంగా కృషి చేశారని, ఆయన సేవలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ నాయకుడు ఇరుసవడ్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాకర్లపూడి విక్రాంత్, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అంతిమయాత్రలో నివాళులర్పించారు.