అశోక్ లేలాండ్ దోస్త్ వాహనాల చోరీ ముఠా అరెస్ట్
ఇద్దరు నిందితుల అదుపులోకి..
చోరీ సొత్తు స్వాధీనం
గంగవరం, ఆంధ్రప్రభ : జిల్లాలో వరుసగా జరుగుతున్న అశోక్ లేలాండ్ దోస్త్ వాహనాల చోరీ కేసులను గంగవరం పోలీసులు ఛేదించారు. ఇద్దరు అంతర్రాష్ట్ర వాహనాల చోరీ ముఠా సభ్యులను అరెస్ట్ చేసి, చోరీకి గురైన వాహనంతో పాటు ఇతర సొత్తును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు ఇప్పటికే చిత్తూరు సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ పర్యవేక్షణలో, గంగవరం సీఐ బి. పరుశురాముడు ఆధ్వర్యంలో ఎస్‌ఐ ఎ. వెంకటనారాయణ, సబ్ డివిజన్ ఐడీ పార్టీ, స్టేషన్ సిబ్బంది ప్రత్యేక నిఘా నిర్వహించారు. ఈ క్రమంలో శనివారం మధ్యాహ్నం గంగవరం మండలం గండ్రాజుపల్లి చెక్‌పోస్ట్ వద్ద చెన్నై–బెంగళూరు జాతీయ రహదారిపై వాహనాల తనిఖీలు నిర్వహించి, గంగవరం పోలీస్ స్టేషన్ క్రైం నంబర్ 70/2026 కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
విచారణలో తమిళనాడుకు చెందిన ఎం. వెంకటేషన్ (29), ఎం. సెల్వకుమార్ అలియాస్ చిన్నపాయ (32)తో పాటు మరో నిందితుడు టి. ఆనంద్ రాజ్ కలిసి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అశోక్ లేలాండ్ దోస్త్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ముందుగా రక్కీ నిర్వహించి, అనంతరం చోరీలకు పాల్పడినట్లు అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ముఠా ఈ ఏడాది మే 5న గంగవరం మండలం మబ్బువారిపేట గ్రామంలో రోడ్డుపై పార్క్ చేసి ఉన్న ఏపీ03 టీకే 3817 నంబర్ గల అశోక్ లేలాండ్ దోస్త్ వాహనాన్ని, అందులో ఉన్న 27 అల్యూమినియం పాల క్యాన్‌లను చోరీ చేసినట్లు ఒప్పుకున్నట్లు వెల్లడించారు. నిందితుల వద్ద నుంచి చోరీకి గురైన వాహనాన్ని స్వాధీనం చేసుకోగా, పాల క్యాన్‌లను గుర్తు తెలియని వ్యక్తులకు విక్రయించినట్లు విచారణలో తేలిందని తెలిపారు.
ఈ కేసులో మూడో నిందితుడు టి. ఆనంద్ రాజ్ ఇప్పటికే చిత్తూరు సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. జిల్లాలో వాహనాల చోరీలు, ఇతర ఆస్తి నేరాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా కొనసాగుతోందని, నేరస్థులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా పోలీసులు హెచ్చరించారు. ప్రజలు తమ వాహనాలను సురక్షిత ప్రదేశాల్లో పార్క్ చేయాలని, అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు లేదా డయల్-112కు సమాచారం అందించాలని సూచించారు.
