సమృద్ధిగా వర్షాలు కురవాలని కాళేశ్వరంలో వరుణ యాగం

మహాదేవపూర్, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు తొలగి సమృద్ధిగా వర్షాలు కురిసి రైతులు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో శనివారం వరుణ యాగాన్ని ఘనంగా నిర్వహించారు.

గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో కాళేశ్వరం బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వరుణ పాశుపత రుద్రాభిషేకం, ప్రత్యేక హోమాలు, వరుణ యాగం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

ఈ సందర్భంగా వేదపండితులు రాష్ట్రవ్యాప్తంగా సకాలంలో వర్షాలు కురవాలని, నదులు, చెరువులు, జలాశయాలు జలకళ సంతరించుకోవాలని, రైతులు సాగు చేసిన పంటలు సమృద్ధిగా పండాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తొలగి వ్యవసాయ రంగం పునరుజ్జీవనం పొందాలని సంకల్పంతో యాగాన్ని నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

ప్రస్తుతం వర్షాల కోసం రైతులు ఆతృతగా ఎదురుచూస్తున్న నేపథ్యంలో ప్రకృతి అనుగ్రహంతో ప్రతి పొలం పచ్చగా కళకళలాడాలని ఆకాంక్షించారు. రైతు సంక్షేమమే దేశాభివృద్ధికి పునాది అని పేర్కొంటూ, “రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది.. రాష్ట్రం బాగుంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది” అని నిర్వాహకులు అన్నారు.

యాగంలో స్థానిక భక్తులు, గ్రామ పెద్దలు, రైతులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని వేదపండితులు ఆశీర్వచనాలు అందించారు.