నందికొట్కూరులో తృటిలో తప్పిన పెను విషాదం
కేసీ కెనాల్‌లోకి దూసుకెళ్లిన బొలెరో
అల్లూరు వెళ్తున్న బొలెరో బోల్తా
15 మందికి గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
రోడ్డు మార్జిన్ లోపమే కారణం
కెనాల్‌లోకి ఒరిగిన బొలెరో, స్థానికుల ఆగ్రహం
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నంద్యాల జిల్లా నందికొట్కూరు మండల పరిధిలో శనివారం భారీ ప్రమాదం తృటిలో తప్పింది. శాతనకోట నుంచి కేసీ కెనాల్ మీదుగా అల్లూరు గ్రామానికి వెళ్తున్న ఏపీ21 టిబి 1463 నంబర్ గల బొలెరో వాహనం రోడ్డు మార్జిన్ సరిగా లేకపోవడంతో అదుపుతప్పి కేసీ కెనాల్‌లోకి ఒరిగిపోయింది.
ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇచ్చే ప్రయత్నంలో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో వాహనంలో అల్లూరు గ్రామానికి చెందిన సుమారు 15 మంది ప్రయాణికులు ఉన్నారు.

వాహనం పూర్తిగా కెనాల్‌లోకి తిరగబడకపోవడంతో పెను ప్రాణాపాయం తప్పింది. అయితే ప్రమాదంలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండగా, మిగిలిన వారికి చేతులు, కాళ్లకు విరుగుడులు, పలువురికి తలకు తీవ్ర గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వాహనం నుంచి బయటకు తీసి ప్రథమ చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
