పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం..

  • ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’లో ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌

పటమట, ఆంధ్రప్రభ : ఇంటితో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ఆరోగ్యకరమైన జీవనం సాధ్యమవుతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ అన్నారు. తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్‌ కరెన్సీ నగర్‌ ఆంజనేయస్వామి ఆలయ ప్రాంతంలో శనివారం నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ.. పరిశుభ్రత ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రజలు కూడా శ్రమదానం చేసి తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి, పొడి చెత్తను వేరు చేసి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని కోరారు.

ప్రతి నెలా మూడో శనివారం నిర్వహించే కార్యక్రమాల ద్వారా ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కార్పొరేషన్‌ జోనల్‌ కమిషనర్‌ షమీ మాట్లాడుతూ.. బల్క్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ విధానాన్ని అమలు చేస్తున్నామని, వ్యాపార సంస్థలు, పాఠశాలలు తమ వద్ద ఉత్పత్తయ్యే వ్యర్థాలను రీసైక్లింగ్‌ చేయాలని సూచించారు. ఇళ్ల నుంచి సేకరించే తడి, పొడి, హానికర వ్యర్థాలతో పాటు ఈ–వ్యర్థాలను కూడా వేర్వేరుగా సేకరించి పారిశుద్ధ్య సిబ్బందికి అందించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు గద్దె రమేష్‌, తాడి బాబురావు, ముమ్మనేని ప్రసాద్‌, యలమంచిలి యలమందరావు, గుళ్లపల్లి నారాయణరావు, మురళీకృష్ణ, బండి సాయి కోమలి, గుళ్లపల్లి శంకర్‌, రాగాని సాయి, గుంజి ఏసుబాబు, గల్లా రవి, కార్పొరేషన్‌ ఈఈ రామారావు తదితరులు పాల్గొన్నారు.