పిండిప్రోలు గ్రామంలో అర్ధరాత్రి భీభత్సం..

వృద్ధ మహిళపై ప్రాణాంతక దాడి

బంగారు నగలతో పరారైన దుండగులు.. గ్రామంలో తీవ్ర కలకలం

పాలేరు నియోజకవర్గం, జూలై 18 ఆంధ్రప్రభ: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధ దంపతులను లక్ష్యంగా చేసుకున్న గుర్తుతెలియని దుండగులు, వృద్ధ మహిళపై ప్రాణాంతకంగా దాడి చేసి ఆమె వద్ద ఉన్న బంగారు నగలను అపహరించి పరారయ్యారు. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

స్థానికుల కథనం ప్రకారం, వరంగల్–ఖమ్మం జాతీయ రహదారి పక్కన ఉన్న ఇంట్లో చెన్న జనార్దన్, సుగుణమ్మ దంపతులు నివసిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు వారి ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న 60 ఏళ్ల సుగుణమ్మపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన అనంతరం, ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను దోచుకుని అక్కడి నుంచి పరారయ్యారు.

దుండగులు ఎంతమంది ఉన్నారు? ఏ మార్గంలో ఇంట్లోకి ప్రవేశించారు? దాడి అనంతరం ఏ దిశగా పరారయ్యారు? అనే విషయాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. దోపిడీ కోసం ముందుగానే ఇంటిని లక్ష్యంగా చేసుకున్నారా? లేక అవకాశాన్ని వినియోగించుకున్నారా? అనే కోణంలోనూ పోలీసులు విచారణ సాగిస్తున్నారు.

శనివారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామస్థులు పెద్ద సంఖ్యలో సంఘటనా స్థలానికి చేరుకుని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రశాంతంగా ఉండే గ్రామంలో ఇలాంటి ఘటన జరగడం పట్ల ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జాతీయ రహదారికి సమీపంలో ఇళ్లు ఉండటంతో రాత్రివేళ భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేయాలని, పోలీసు గస్తీని పెంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

సమాచారం అందుకున్న తిరుమలాయపాలెం పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలను సేకరించారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించడంతో పాటు అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.

ఈ ఘటనలో ఎంత మొత్తంలో బంగారు నగలు దోపిడీకి గురయ్యాయనే విషయం ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అలాగే బాధితురాలి ఆరోగ్య పరిస్థితి, దాడికి ఉపయోగించిన ఆయుధం, దోపిడీ వెనుక ఉన్న అసలు కారణాలపై కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. దుండగులను గుర్తించి పట్టుకునేందుకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.