కేబినెట్ కీలక నిర్ణయం.. ధరణిపై దర్యాప్తు !!

  • భూ లావాదేవీలపై సమగ్ర విచారణకు ఆమోదం
  • ప్రభుత్వ, అసైన్డ్, దేవాదాయ, వక్ఫ్ భూముల వ్యవహారాలన్నీ పరిశీలనలోకి

హైదరాబాద్, ఆంధ్రప్రభ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో దాదాపు మూడు గంటలపాటు జరిగిన తెలంగాణ మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమల్లోకి వచ్చిన ధరణి పోర్టల్ నిర్వహణ, దాని ద్వారా జరిగిన అక్రమాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆమోదం తెలిపింది.

మంత్రిమండలి నిర్ణయం మేరకు ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన 2020 అక్టోబర్ 29 నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్ని భూ లావాదేవీలను సిట్ పరిశీలించనుంది. భూ రికార్డుల మార్పులు, అక్రమ మ్యుటేషన్లు, వ్యవసాయ భూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వ భూములు, దేవాదాయ, వక్ఫ్ భూముల బదలాయింపులతో పాటు అనుమానాస్పద రిజిస్ట్రేషన్లన్నింటినీ లోతుగా విచారించనుంది.

టెక్నికల్ నిపుణులు, వివిధ శాఖల అధికారులతో కూడిన ఈ ప్రత్యేక దర్యాప్తు బృందం ధరణి పోర్టల్‌లో ఉన్న లోపాలు, వాటిని ఆసరాగా చేసుకుని జరిగిన అక్రమ భూ లావాదేవీలు, భూ ఆక్రమణలు, రికార్డుల మార్పులపై సమగ్రంగా విచారణ చేపట్టనుంది. ఎవరెవరి భూములు అక్రమంగా చేతులు మారాయి, అందులో ఎవరి ప్రమేయం ఉందనే అంశాలపై ఆధారాలు సేకరించి నివేదిక సమర్పించనుంది.

దర్యాప్తులో అక్రమాలకు పాల్పడినట్లు తేలిన వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకునే దిశగా ప్రభుత్వం ముందుకు సాగనుంది. ధరణి వ్యవహారంపై కేబినెట్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన భూ లావాదేవీలపై సిట్ విచారణతో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.