అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు
- మూడో రోజే 27 సారె బృందాలు.. 15,968 మంది మహిళల రాక
- భవానీ అనుగ్రహ దర్శన క్యూ పూర్తిగా సారె భక్తులకే కేటాయింపు…
- రిజిస్ట్రేషన్ నుంచి దర్శనం వరకు పకడ్బందీ ఏర్పాట్లు: చైర్మన్ బొర్రా గాంధీ
- క్యూలైన్లు, సారె సమర్పణ ఏర్పాట్లను పరిశీలించిన ఈవో శీనా నాయక్
- రైల్వే స్టేషన్, బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు
- వాహనాల నియంత్రణతో ట్రాఫిక్ సౌకర్యం
ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ: ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మను ఇంటి ఇలవేల్పుగా, ఆడపడుచుగా భావించే మహిళా భక్తులు శుక్రవారం పెద్దఎత్తున పసుపు, కుంకుమ, గాజులు, చీరలు, సారెలతో అమ్మవారి సన్నిధికి తరలివచ్చారు. ఆషాఢ సారె ఉత్సవాల మూడో రోజు ఇంద్రకీలాద్రి మహిళా భక్తులతో కిటకిటలాడింది. సాయంత్రం ఐదు గంటల వరకు 27 సారె బృందాల్లో 15,968 మంది భక్తులు అమ్మవారికి సారె సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
అమ్మవారి అనుగ్రహ దర్శనం
సారె భక్తుల సౌకర్యార్థం భవానీ అనుగ్రహ దర్శనం (రూ.100 దర్శనం) క్యూ లైన్‌ను పూర్తిగా సారె బృందాలకు కేటాయించినట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. సారె బృందాల రిజిస్ట్రేషన్, క్యూ లైన్ నిర్వహణ, దర్శన ఏర్పాట్లను దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
.భక్తులను పలకరిస్తూ
దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) సారె బృందాలను పలకరించి ఈ ఏడాది రిజిస్ట్రేషన్ నుంచి దర్శనం, సారె సమర్పణ, ఆశీర్వచనం, అన్నప్రసాదం వరకు ప్రతి అంశాన్ని ఒక నిర్దిష్ట విధానంలో నిర్వహిస్తున్నామని తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు.
పక్క జిల్లాల నుండి కూడా రాక
శుక్రవారం గుంటూరు, బాపట్ల, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో సారె బృందాలు ఇంద్రకీలాద్రికి చేరుకున్నాయి. సారె భక్తుల రాకతో ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని శ్రీ కనకదుర్గ నగర్‌లో వాహనాల రాకపోకలను నియంత్రించారు. అలాగే రైల్వే స్టేషన్, పండిట్ నెహ్రూ బస్ స్టేషన్ నుంచి దేవస్థానం ప్రత్యేక బస్సుల సంఖ్యను పెంచి భక్తుల రవాణాకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టారు. ఆషాఢ సారె ఉత్సవాలు కొనసాగుతున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉండటంతో దేవస్థానం అన్ని విభాగాలను అప్రమత్తం చేసి విస్తృత ఏర్పాట్లు కొనసాగిస్తోంది.



