ఫిఫా ఫీవర్.. ఫుట్‌బాల్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ !!
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఫిఫా వరల్డ్ కప్–2026 మూడో స్థానం ప్లే-ఆఫ్, ఫైనల్ మ్యాచ్‌ల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం బార్లు, క్లబ్‌లు, మైక్రోబ్రూవరీల వ్యాపార వేళలను ప్రత్యేకంగా పొడిగించింది. ఈ మేరకు తెలంగాణ మద్యం నిషేధం, ఎక్సైజ్ కమిషనర్ సి. హరి కిరణ్ ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రభుత్వ అనుమతితో తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని 2బీ బార్లు, సి1 క్లబ్‌లు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు చెందిన టీడీ1, టీడీ2 ఇన్‌హౌస్ లైసెన్సులు, మైక్రోబ్రూవరీలకు ఈ సడలింపు వర్తించనుంది.
ఉత్తర్వుల ప్రకారం, జూలై 18-19 మధ్య జరిగే మూడో స్థానం ప్లే-ఆఫ్ మ్యాచ్ సందర్భంగా బార్లు, క్లబ్‌లు జూలై 19 తెల్లవారుజామున 4.30 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగించేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే జూలై 19-20 మధ్య జరిగే ఫిఫా ప్రపంచకప్ ఫైనల్ సందర్భంగా జూలై 20 తెల్లవారుజామున 3 గంటల వరకు వ్యాపార వేళలను పొడిగించారు.
అయితే ఈ ప్రత్యేక అనుమతి ప్రస్తుతం అమల్లో ఉన్న అన్ని చట్టాలు, నిబంధనలకు లోబడి మాత్రమే అమలులో ఉంటుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
ఈ నిర్ణయాన్ని అమలు చేయాలని గ్రేటర్ హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్లు, హైదరాబాద్, సికింద్రాబాద్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి జిల్లాల ఎక్సైజ్ అధికారులకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే సంబంధిత జిల్లా కలెక్టర్లు, పోలీసు కమిషనర్లకు కూడా సమాచారం అందించాలని సూచించారు.
