గోల్కొండ బోనాలకు ఘనారంభం.. జగదాంబికా మహంకాళికి తొలి బోనం
బోనమెత్తిన మంత్రి కొండా సురేఖ.. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, రూ.11 లక్షల విరాళం సమర్పణ
హైదరాబాద్, ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్సవాలు గురువారం చారిత్రాత్మక గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబికా మహంకాళి ఆలయంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. లంగర్ హౌస్‌లోని ఆలయంలో అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో బోనాల సంబరాలకు శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ సంప్రదాయబద్ధంగా బోనం ఎత్తి అమ్మవారికి సమర్పించారు. అనంతరం ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ కలిసి జగదాంబికా మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో తొలి బంగారు బోనాన్ని సమర్పించడంతో పాటు ఆలయ అభివృద్ధి కోసం ప్రభుత్వం తరఫున రూ.11 లక్షల విరాళం చెక్కును అందజేశారు.

బోనాల శోభాయాత్రలో శివసత్తుల పూనకాలు, పోతురాజుల వీరవిన్యాసాలు, డప్పు చప్పుళ్లు, సాంప్రదాయ కళారూపాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. భక్తుల జై మహంకాళి నినాదాలతో లంగర్ హౌస్ పరిసర ప్రాంతాలు మార్మోగగా, ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.
ఉత్సవాల్లో పాల్గొనేందుకు హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీతో గోల్కొండ కోట పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ వి. హనుమంతరావు, ఎమ్మెల్యే మెట్టు సాయికుమార్, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
బోనాల ఉత్సవాలు ప్రశాంతంగా, భక్తిశ్రద్ధల మధ్య జరిగేలా పోలీసులు విస్తృత భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీ బందోబస్తుతో పాటు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టారు. గోల్కొండ బోనాలతో ప్రారంభమైన ఆషాఢ ఉత్సవాలు రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరమంతటా వైభవంగా కొనసాగనున్నాయి.
