ఆషాఢ సారె సమర్పించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ దంపతులు…
కనకదుర్గమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకున్న జి. లక్ష్మీశ
ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికిన చైర్మన్, ఈవో
(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలోని శ్రీ కనకదుర్గమ్మ వారిని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆషాఢ సారె సమర్పణ ఉత్సవాల సందర్భంగా కలెక్టర్ దంపతులు ఇంద్రకీలాద్రికి విచ్చేసి అమ్మవారికి సంప్రదాయబద్ధంగా ఆషాఢ సారె సమర్పించారు.
ఈ సందర్భంగా దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ కలెక్టర్ దంపతులకు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం వారిని అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఆషాడ సార సమర్పించిన కలెక్టర్ దంపతులు ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

దర్శనం అనంతరం వేద పండితులు కలెక్టర్ దంపతులకు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు ప్రసాదాలు సమర్పించారు. ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిలో భక్తుల సందడి కొనసాగుతుండగా, దేవస్థానం అధికారులు భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం కల్పించేందుకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.
