అమ్మవారికి ఆషాఢ సారె సమర్పించిన దేవాదాయ శాఖ కమిషనర్..

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న కే. రామచంద్ర మోహన్..
రెండో రోజు ఆషాఢ సారె సమర్పణలో పాల్గొని ప్రత్యేక పూజలు..
ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన ఈఓ వి.కె. శీనా నాయక్..


(ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలోని శ్రీ కనకదుర్గమ్మ వారిని ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ కమిషనర్ కే. రామచంద్ర మోహన్ గురువారం దర్శించుకున్నారు. ఆషాఢ సారె సమర్పణ ఉత్సవాల రెండో రోజు సందర్భంగా ఆయన ఇంద్రకీలాద్రికి విచ్చేసి అమ్మవారికి సంప్రదాయబద్ధంగా ఆషాఢ సారె సమర్పించారు.

దేవాదాయ శాఖ కమిషనర్‌కు ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనా నాయక్ ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు ప్రసాదాలు సమర్పించారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), వైదిక కమిటీ సభ్యుడు శంకర శాండిల్యతో పాటు దేవస్థాన అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. ఆషాఢ మాస ఉత్సవాల సందర్భంగా ఇంద్రకీలాద్రిలో భక్తుల రద్దీ కొనసాగుతుండగా, దేవస్థానం అధికారులు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.