సిరిచెల్మలో కమ్యూనిటీ కాంటాక్ట్.. 156 బైక్‌లు స్వాధీనం
ఇచ్చోడ (ఆంధ్రప్రభ): ప్రజల రక్షణ, భద్రతను మరింత బలోపేతం చేయడం, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడం లక్ష్యంగా ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఇచ్చోడ మండలం సిరిచెల్మ గ్రామంలో గురువారం ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. సుమారు 120 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో సరైన ధ్రువపత్రాలు లేని 156 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు, 8 కార్లు, బొలెరో వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నంబర్ ప్లేట్లు లేని మూడు వాహనాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.
అలాగే అక్రమంగా కల్తీ కల్లు తయారీకి వినియోగించే సుమారు ఒక క్వింటాల్ అమ్మోనియం బైకార్బోనేట్‌ను స్వాధీనం చేసుకుని నిందితుడు సురేందర్ గౌడ్‌పై కేసు నమోదు చేస్తున్నట్లు తెలిపారు. అనుమతులు లేకుండా మద్యం విక్రయిస్తున్న పి. శ్రీనివాస్ గౌడ్ వద్ద సుమారు 200 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని అతనిపై కూడా ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.
ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రజలు అసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి, మాదకద్రవ్యాల వినియోగం, దొంగతనాలు, దోపిడీలు, బలవంతపు వసూళ్లు, నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడపడం, దొంగ వాహనాల కొనుగోలు వంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే కేసుల్లో ఉన్న పలువురిపై సస్పెక్ట్ షీట్లు, రౌడీ షీట్లు తెరిచినట్లు, అవసరమైతే మరిన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు.
గ్రామంలో నేరాలకు సంబంధించిన సమాచారం ఉంటే 8712659973 వాట్సాప్ నంబర్‌కు పంపించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ తెలిపారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉట్నూర్ ఏఎస్పీ రుత్వీక్ సాయి కొట్టే, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. వెంకట నరసయ్య, ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, సీఐ నరేష్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి. వెంకటి, టి. మురళి, ఎస్సైలు, స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు.
