పసికందును వదిలి అనంతలోకాలకు..

వేములవాడ (ఆంధ్రప్రభ): వేములవాడ పట్టణానికి చెందిన ఆటో డ్రైవర్ బాలసాని అజయ్ (24) బుధవారం రాత్రి తన నివాసంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అక్కడికి చేరుకున్నప్పటికీ అప్పటికే అజయ్ మృతి చెందినట్లు తెలిసింది. మృతుడికి కేవలం 15 రోజుల క్రితమే కుమారుడు జన్మించగా, పసికందును వదిలి అజయ్ అకాల మరణం చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సమాచారం అందుకున్న వేములవాడ పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే అజయ్ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో స్థానిక ఆటో కార్మికులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.