Vizag | గంగమ్మ తల్లి అనుగ్రహంతోనే ప్రాణాలతో బయటపడ్డాం..
Vizag | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో ఏడుగురు మత్స్యకారులు తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఉదయం చేపల వేటకు వెళ్లిన బోటు అలల ఉద్ధృతి కారణంగా అదుపుతప్పి బోల్తాపడింది.
ప్రమాదం సమయంలో సముద్రంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో బోటుతో పాటు మత్స్యకారులు సమీపంలోని పెద్ద రాళ్ల మధ్య ఇరుక్కుపోయారు. అయితే అందరూ బోటును గట్టిగా పట్టుకుని ఉండటంతో ప్రాణాలతో బయటపడగలిగారు. ఈ ప్రమాదంలో తాతారావు, ఆకాష్ తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే విశాఖలోని కింగ్ జార్జ్ ఆస్పత్రి (కేజీహెచ్)కు తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన మత్స్యకారులు స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం.
ప్రమాదంలో సుమారు రూ.2.50 లక్షల విలువైన బోటు, రూ.2 లక్షల విలువైన చేపల వలలు పూర్తిగా దెబ్బతిన్నాయని మత్స్యకారులు తెలిపారు. దీంతో తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. “గంగమ్మ తల్లి అనుగ్రహంతోనే ప్రాణాలతో బయటపడ్డాం” అని మత్స్యకారులు పేర్కొన్నారు. ప్రమాదంలో నష్టపోయిన తమను ప్రభుత్వం ఆదుకుని తగిన పరిహారం అందించాలని వారు విజ్ఞప్తి చేశారు.
