కుడంకుళం అణు కేంద్రం డేటా లీక్.. అణు కేంద్రాల భద్రతపై పెరుగుతున్న ఆందోళన

కుడంకుళం అణు కేంద్రం డేటా లీక్.. అణు కేంద్రాల భద్రతపై పెరుగుతున్న ఆందోళన

డార్క్ వెబ్‌లో 19 వేల ఫైళ్లు.. భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు

అణు రహస్యాల భద్రతకు సవాల్.. దర్యాప్తు ప్రారంభించిన సంస్థలు


మన దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన కుడంకుళం అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన రహస్య ఫైళ్లు లీక్ కావడం దేశ భద్రతకు సంబంధించిన ఆందోళన కలిగించే విషయం. ఈ అణు విద్యుత్ కేంద్రానికి సంబంధించిన 19 వేల ఫైళ్లను వరల్డ్ లీక్స్ అనే హ్యాకర్ల బృందం రాన్సమ్‌వేర్ గ్రూపు సేకరించి డార్క్ వెబ్‌సైట్‌లో ప్రచురించింది.

లీకైన పత్రాలు ఈ కేంద్రానికి కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తున్న రిలయెన్స్ గ్రూపునకు చెందినవని హ్యాకర్ల బృందం వెల్లడించింది. థర్డ్ పార్టీ డేటా ప్రొవైడర్ అయిన యోటా సర్వర్లలో భద్రపరిచిన ఫైళ్లపై దాడి జరిగినట్టు గుర్తించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ సర్వర్లను హ్యాక్ చేసి, ఆ తర్వాత డబ్బు డిమాండ్ చేయడం ఈ హ్యాకర్ల పని.

మన దేశంలో అణు విద్యుత్ కేంద్రాల్లో కుడంకుళం అత్యంత ప్రధానమైనది. ఈ కేంద్రంలోని డేటా లీక్ కావడం భద్రతాపరంగా తీవ్రమైన అంశం. అణు కేంద్రాల భద్రతపైనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.

కుడంకుళం కేంద్రం తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఉంది. భారత్లో హ్యాకింగ్ సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయని అణు సమాచార ముప్పు వివరాల ఇనీషియేటివ్ సీనియర్ డైరెక్టర్ నికోలస్ రొథ్ ఒక వార్తా సంస్థకు తెలిపారు. ఈ సంస్థ సమీక్షించిన పత్రాలు 2016 నుంచి 2025 సంవత్సరాల మధ్యకాలానికి చెందినవని ఆయన చెప్పారు. అయితే, వాటి ప్రామాణికతను పూర్తిగా నిర్ధారించలేకపోయింది.

మన దేశ అణు రహస్యాలను ఇతర దేశాలకు చేరవేసేందుకు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేయడం ఈ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఈ గ్రూప్ ఇంతకుముందు నైక్, టాటా గ్రూపులను లక్ష్యంగా చేసుకుని కూడా డబ్బు డిమాండ్ చేసింది. ఇప్పుడు ప్రభుత్వ రంగానికి చెందిన కుడంకుళం అణు కేంద్రానికి సంబంధించిన ఫైళ్లను లీక్ చేయడానికి హ్యాక్ చేసినట్లు వెల్లడించింది.

ఈ ఫైళ్లలో బ్లూప్రింట్లు, సరఫరాదారుల వివరాలు, మీటింగ్ రికార్డులు, ఇన్‌స్పెక్షన్ వివరాలు, పరికరాల స్థితిపై సమీక్షలు, ఇన్సూరెన్స్ పాలసీలు ఉన్నాయి. జూన్ చివరిలో రిలయెన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డేటా బ్రీచ్ క్లెయిమ్స్ ఉన్నాయని తెలిపింది. 2024లో జరిగిన జాయింట్ ఇన్‌స్పెక్షన్ రికార్డులు, పరికరాలు, ఫొటోలు కూడా ఇందులో ఉన్నాయి.

ఈ వివరాలు పాక్షికంగా బ్రీచ్ అయినట్లు ప్రభుత్వానికి అందించిన సమాచారంలో రిలయెన్స్ సంస్థ అంగీకరించింది. 2019లోనూ కుడంకుళం నెట్‌వర్క్‌లో మాల్‌వేర్ గుర్తించినప్పటికీ కీలక వ్యవస్థలు ప్రభావితం కాలేదని తెలిపింది.

డేటా బ్రీచ్‌లలో ప్రపంచంలో మూడో స్థానంలో మనదేశం ఉంది. గత ఏడాది 28.9 మిలియన్ ఖాతాలు ప్రభావితం అయ్యాయి. ఈ సంఘటనలపై న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సర్ట్-ఇన్ సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి.

అణు కేంద్రాల వంటి అత్యంత కీలకమైన మౌలిక సదుపాయాల భద్రత విషయంలో అత్యున్నత ప్రమాణాలు, పారదర్శక పర్యవేక్షణ, పటిష్ఠమైన సైబర్ రక్షణ అవసరమని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది. దేశ భద్రతకు సంబంధించిన ఇలాంటి అంశాల్లో అప్రమత్తత, సమన్వయం, సమర్థవంతమైన భద్రతా వ్యవస్థ అత్యంత కీలకం.