ఆలయాల్లో చోరీ.. ముగ్గురు నిందితుల అరెస్ట్
- నాలుగు సీసీ కెమెరాలు, రూ.20,600 నగదు స్వాధీనం
- చోరీకి వినియోగించిన ఆటో సీజ్
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : ఉరవకొండ పోలీస్ సర్కిల్ పరిధిలోని రెండు ఆలయాల్లో జరిగిన చోరీ కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసులకు సంబంధించి ముగ్గురు నిందితులను బుధవారం అరెస్టు చేసినట్లు ఉరవకొండ అర్బన్ సీఐ మహానంది, ఉరవకొండ ఎస్సై జనార్ధన్ నాయుడు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం.. పెన్నహోబిలంలోని ఉద్భవ లక్ష్మీదేవి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు సీసీ కెమెరాలు, హుండీని ధ్వంసం చేసి అందులోని నగదును అపహరించారు. అలాగే కొనకొండ్లలోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలోనూ హుండీని పగులగొట్టి నగదు చోరీ చేశారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
దర్యాప్తులో భాగంగా తోటకూర గుజ్జుల విశ్వతేజ, తలారి వంశీకృష్ణ, బోయ మహేష్‌లను నిందితులుగా గుర్తించిన పోలీసులు వజ్రకరూరు మండలంలోని ఎస్‌వీ గోడౌన్ వద్ద అరెస్టు చేశారు. వారి నుంచి నాలుగు సీసీ కెమెరాలు, రూ.20,600 నగదు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ, ఎస్సై వెల్లడించారు.
