మాచనకు కామన్‌వెల్త్ పురస్కారం..?

హైదరాబాద్, ఆంధ్రప్రభ: పొగాకు నియంత్రణ రంగంలో విశేష కృషి చేసి ఇప్పటికే ‘టొబాకో కంట్రోల్ హీరో అవార్డు’ అందుకున్న ఏకైక తెలుగు వ్యక్తి మాచన రఘునందన్ మరో అరుదైన గౌరవానికి చేరువయ్యారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి ప్రదానం చేసే కామన్‌వెల్త్ బయోఎథిక్స్ అవార్డు–2026కు ఆయన ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. మంగళవారం నిర్వహించిన జూమ్ సమావేశంలో ఈ విషయంపై కామన్‌వెల్త్ ప్రతినిధులు స్పష్టత ఇచ్చినట్లు రఘునందన్ తెలిపారు. ఈ అవార్డు కోసం జూన్ నెల ప్రారంభంలో యునెస్కోతో పాటు కామన్‌వెల్త్ సంస్థకు అవసరమైన వివరాలను పంపినట్లు చెప్పారు.

పొగాకు నియంత్రణ కోసం మాచన రఘునందన్ నిరంతరం కృషి చేస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల పరిసరాలను ‘నో స్మోకింగ్ జోన్’లుగా అమలు చేయాలని ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు, ప్రధాని కార్యాలయం, రాష్ట్ర ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీలకు కూడా టొబాకో నియంత్రణపై కఠిన చర్యలు తీసుకోవాలని వినతిపత్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఆయనకు కామన్‌వెల్త్ బయోఎథిక్స్ అవార్డు దక్కే అవకాశం ఉండటం విశేషంగా మారింది.