ఆపరేషన్ ముస్కాన్–లో బాల కార్మికుడి రక్షణ

  • గ్యారేజ్ యజమానిపై కేసు

భీమ్‌గల్ టౌన్, ఆంధ్రప్రభ: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్–XII కార్యక్రమంలో భాగంగా భీమ్‌గల్‌లో ఒక బాల కార్మికుడిని అధికారులు రక్షించారు. ఈ ఘటనకు సంబంధించి గ్యారేజ్ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మంగళవారం సాయంత్రం సుమారు 5:30 గంటలకు ముప్కాల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ కిరణ్ పాల్ ఆధ్వర్యంలో చైల్డ్ లైన్, కార్మిక శాఖ, సాధన ఎన్జీవో సంయుక్త బృందం భీమ్‌గల్ గ్రామంలో తనిఖీలు నిర్వహించింది.

ఈ సందర్భంగా భీమ్‌గల్ బడా రోడ్డులోని జె.డి. ట్రేడర్ గ్యారేజ్‌లో ఒక మైనర్ బాలుడు పని చేస్తున్నట్లు గుర్తించి రక్షించారు. విచారణలో బాలుడు జాకిరుద్దీన్ (15) గా గుర్తించగా, గ్యారేజ్ యజమాని మొహమ్మద్ ఉస్మాన్ చట్ట విరుద్ధంగా బాలుడిని పనిలో నియమించినట్లు తేలింది. చైల్డ్ లైన్ సూపర్వైజర్ కేతావత్ బిక్సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో సంబంధిత చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఈ సందర్భంగా జిల్లా పోలీసులు మాట్లాడుతూ.. బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టరీత్యా నేరమని, చిన్నారుల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తు దృష్ట్యా ఎవరూ బాల కార్మికులను నియమించరాదని సూచించారు. ఎక్కడైనా బాల కార్మికులు పనిచేస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్ లేదా చైల్డ్ హెల్ప్‌లైన్–1098కు సమాచారం అందించాలని ఎస్సై తిరుపతి కోరారు.