పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి

  • పిఆర్సీని వెంటనే ప్రకటించాలి
  • పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలి
  • టీఎస్ యూటీఎఫ్ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ

మరిపెడ, ఆంధ్రప్రభ: పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని, టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఏ. మురళీకృష్ణ అన్నారు. మంగళవారం యూటీఎఫ్ మరిపెడ మండల సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా అధ్యక్షులు మురళీకృష్ణ పలు పాఠశాలలు సందర్శించి మాట్లాడారు. ప్రభుత్వం రాష్ట్ర ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల జేఏసికి ఇచ్చిన హామీ మేరకు జూన్ నెలాఖరు వరకు పీఆర్సి ప్రకటిస్తామని, పెండింగ్ బిల్లులు చెల్లిస్తామని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయడంలేదని విమర్శించారు.

హామీలన్నీ తక్షణమే అమలు చేయాలని, లేనియెడల భవిష్యత్ పోరాట కార్యక్రమాన్ని ప్రకటిస్తామని హెచ్చరించారు. సీపీఎస్ రద్దు చేయాలని, 317 జీవో బాధితులకు న్యాయం చేయాలని, ఎంఈవో, డిప్యూటీ ఈవో పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలన్నారు.మోడల్ స్కూల్, కేజీబీవీ, యూఆర్ఎస్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని, సమగ్ర శిక్ష సిబ్బందికి మినిమం బేసిక్ పే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు నందిగామ జనార్ధనా చారి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు లింగా నాయక్ ప్రభాకర్ లు మండల బాధ్యులు గోవర్ధన్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.