పదోన్నతి పొందిన ఎక్సైజ్ అధికారులకు ఘన సన్మానం
జఫ్రుల్లా, కృపవర కుమారుకు ఎమ్మెల్యే గిత్త జయసూర్య అభినందనలు.. నిజాయితీ సేవలకు ప్రశంసలు
నందికొట్కూరు, ఆంధ్రప్రభ : నందికొట్కూరు డివిజన్ ఎక్సైజ్ శాఖలో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ సీఐగా పదోన్నతి పొంది డోన్‌కు బదిలీ అవుతున్న జఫ్రుల్లాతో పాటు, హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తూ ఎస్సైగా పదోన్నతి పొంది కోడుమూరుకు బదిలీ అవుతున్న కృపవర కుమారును నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త జయసూర్య ఘనంగా సన్మానించారు.
మంగళవారం స్థానిక ఎక్సైజ్ స్టేషన్‌లో ఎక్సైజ్ సీఐ రామాంజనేయులు నాయక్, సిబ్బంది ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త జయసూర్య మాట్లాడుతూ జఫ్రుల్లా నందికొట్కూరులో అందించిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. నాటు సారా తయారీ, అక్రమ మద్యం రవాణాను అరికట్టడంలో ఆయన చూపిన చిత్తశుద్ధి, నిబద్ధత అభినందనీయమన్నారు. కానిస్టేబుల్‌గా ఇదే నందికొట్కూరులో ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించిన జఫ్రుల్లా అంచెలంచెలుగా ఎదిగి నేడు సీఐ స్థాయికి చేరడం శాఖకే గర్వకారణమని పేర్కొన్నారు.
నిజాయితీ, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేస్తే ఉన్నత స్థానాలను చేరుకోవచ్చని జఫ్రుల్లా నిరూపించారని, ఆయన సేవలను నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ గుర్తుంచుకుంటారని ఎమ్మెల్యే అన్నారు. డోన్‌లోనూ ఇదే స్ఫూర్తితో పనిచేసి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
అలాగే హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఎస్సైగా పదోన్నతి పొంది కోడుమూరుకు బదిలీ అవుతున్న కృపవర కుమారును కూడా ఎమ్మెల్యే అభినందించారు. నూతన బాధ్యతల్లోనూ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.
అనంతరం ఎమ్మెల్యే గిత్త జయసూర్య, సీఐ రామాంజనేయులు నాయక్, హెడ్ కానిస్టేబుల్ నాయక్‌తో కలిసి ఇద్దరు అధికారులను శాలువాలు, పూలమాలలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో పగిడ్యాల మండల టీడీపీ కన్వీనర్ పలుచాని మహేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు జమీల్, నందికొట్కూరు మండల ఉపాధ్యక్షులు పబ్బతి జ్యోతి రవికుమార్, ఎక్సైజ్ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
