నేర నియంత్రణే లక్ష్యం – అలసత్వానికి తావులేదు

నేర నియంత్రణే లక్ష్యం – అలసత్వానికి తావులేదు
డయల్ 112 కాల్స్‌పై వెంటనే స్పందించాలి: ఎస్పీ విక్రాంత్ పాటిల్
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : జిల్లాలో నేర నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పోలీసులు కట్టుదిట్టంగా పని చేయాలని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. విధుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు పాల్గొన్న నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలని స్పష్టం చేశారు.
డయల్ 112 కాల్స్‌పై ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం వహించరాదని, ప్రతి కాల్‌కు వెంటనే స్పందించాలని ఆదేశించారు. ఈ వ్యవస్థను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. సీసీఎస్ పోలీసుల పనితీరును సమీక్షిస్తూ నేర పరిశోధనలో నాణ్యత పెంచాలని సూచించారు. రాత్రి గస్తీ బృందాలు మరింత చురుకుగా పని చేయాలని, అనుమానితుల వివరాలను సేకరించేందుకు మొబైల్ చెక్ డివైసులను వినియోగించాలని ఆదేశించారు.
జిల్లాలో విజిబుల్ పోలీసింగ్‌ను బలోపేతం చేసి, బృందాలుగా ఏర్పడి పకడ్బందీగా తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేసి సమర్థవంతంగా పూర్తి చేయాలని, డ్రోన్ కెమెరాలను నేర నియంత్రణలో వినియోగించాలని సూచించారు. ప్రాపర్టీ కేసులను చేధించి రికవరీ శాతాలను పెంచాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ పిటిషన్లను నిర్లక్ష్యం చేయకుండా సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుని వేగంగా పరిష్కరించాలని తెలిపారు.
శాంతిభద్రతలకు భంగం కలిగించే అసాంఘిక కార్యకలాపాలపై పీడీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. పోక్సో కేసుల్లో 60 రోజుల్లోపు చార్జ్ షీట్లు దాఖలు చేయాలని ఆదేశించారు. గత నెలలో వివిధ కేసుల్లో ప్రతిభ కనబరచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు హుస్సేన్ పీరా, లీగల్ అడ్వైజర్ మల్లికార్జునరావు, డీఎస్పీలు వెంకట్రామయ్య, ఉపేంద్రబాబు, భార్గవి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
