మందు మాఫియాకు మకుటం లేని మహారాజు..!

  • వైన్‌షాపుల్లో స్టాక్‌ అంతా.. బెల్ట్‌షాపుల్లోనే..
  • నాలుగు షాపుల సరుకంతా ఒకే కనుసన్నల్లోకి వెళ్లిందన్న ఆరోపణలు
  • క్వార్టర్‌పై అదనంగా రూ.20-40
  • బెల్ట్‌షాపుల గుప్పిట్లో గ్రామాలన్నీ
  • మద్యం డాన్‌ మాటే శాసనమా..?
  • అధికారుల మౌనంపై అనుమానాలు

ఖమ్మం, ఆంధ్రప్రభ : కూసుమంచి మండలంలో వైన్ షాపులు కేవలం నామమాత్రంగానే త‌ప్ప‌.. వాస్తవానికి మద్యం మాత్రం బెల్ట్ షాపులలోనే లభిస్తోందన్న బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ అనుమతి పొందిన షాపుల్లో అడిగిన బ్రాండ్లు అందుబాటులో లేవని సిబ్బంది చెబుతుండగా, అదే బ్రాండ్లు కొద్ది దూరంలోనే ఉన్న బెల్ట్ షాపుల్లో అమ్ముడవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అనుమతి పొందిన మద్యం దుకాణాల్లో ఖాళీ రాక్‌లు కనిపిస్తుండగా, గ్రామాల్లోని బెల్ట్ షాపులు మాత్రం మద్యం సీసాలతో నిండి కనిపిస్తున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. అనుమతి పొందిన దుకాణాలకు చేరే మద్యం నిల్వలను నిర్ణీత ప్రాంతాల్లో విక్రయించడానికి బదులుగా, నేరుగా అనధికారిక బెల్ట్ షాపులు తరలిస్తున్నారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి.

ప్రభుత్వ పన్నులు చెల్లించి సేకరించిన మద్యం చివరికి అక్రమ వ్యాపారానికి సాధనంగా మారడం పట్ల ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో మద్యం కోసం ప్రజలు MRP (గరిష్ట విక్రయ ధర) కంటే ఎక్కువ ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగే అక్రమం మాత్రమే కాదని, ఒక ప్రణాళికాబద్ధమైన విధానంతో నడుస్తున్న సిండికేట్ వ్యవస్థ అని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఒక్క డాన్‌… నాలుగు షాపులు… వందల బెల్ట్‌షాపులు..!

కుసుమంచిలో మద్యం వ్యాపారం వెనుక ఒకే వ్యక్తి చక్రం తిప్పుతున్నారనే ప్రచారం మండలమంతా జోరుగా సాగుతోంది. వైన్ షాపులకు సరుకు కేటాయింపు, నిల్వల తరలింపు, బెల్ట్ షాపులకు నిర్దిష్ట బ్రాండ్ల పంపిణీకి సంబంధించిన నిర్ణయాలన్నీ ఆయన ప్రత్యక్ష పర్యవేక్షణలోనే జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

నాలుగు వైన్ షాపులు విడివిడి సంస్థలుగా కనిపిస్తున్నప్పటికీ, ఆ వ్యాపారం ఒకే కేంద్రం నుండి నియంత్రితమవుతోందని పలువురు చెబుతున్నారు. గ్రామాల్లో బెల్ట్ షాపులు నడిపే వారందరూ ఒకే సిండికేట్‌లో భాగంగానే పనిచేస్తున్నారనే ప్రచారం కూడా ఉంది. ఎవరూ MRP ధ‌ర‌కి అమ్మకూడదని, అందరూ తప్పనిసరిగా ఒకే రకమైన అదనపు ధరను వసూలు చేయాలని నిర్దేశించే కొన్ని లిఖితపూర్వకం కాని నియమాలు ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఈ విధానాన్ని ధిక్కరించేవారు వ్యాపారంలో నిలదొక్కుకోలేరనే భయానక వాతావరణం నెలకొందని చెబుతున్నారు. కూసుమంచిలో మద్యం వ్యాపారం మార్కెట్‌ సూత్రాలతో కాదు…. ఆ డాన్‌ ఆదేశాలతో నడుస్తోందన్న విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి.

స్టాక్‌ మాయం… లాభాలన్నీ సిండికేట్‌కే..!

లైసెన్స్ ఉన్న వైన్ షాపులలో అమ్మకాలు కేవలం ఎంఆర్‌పి ధరను మాత్రమే ఇస్తుండగా, అనధికారిక బెల్ట్ షాపులలో అమ్మకాలపై ప్రతి పావు సీసాకు రూ.20 నుండి రూ.40 వరకు అదనపు లాభం వస్తుందనే లెక్క ఆధారంగా సరుకును దారి మళ్లిస్తున్నారని ఆరోపణలు సూచిస్తున్నాయి. ఈ మార్గం ద్వారా ప్రతిరోజూ వేలాది పావు సీసాలు అమ్ముడవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.

ఈ అదనపు వసూళ్లు రోజుకు లక్షల రూపాయలు, నెలకు కోట్ల రూపాయల వరకు ఉంటాయని అంచనాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం కాగా, క్షేత్రస్థాయిలో మాత్రం సిండికేట్ రేట్లు అమలవుతున్నాయని విమర్శకులు ఎత్తిచూపుతున్నారు.

సిండికేట్ కోట్లాది రూపాయల లాభాలను ఆర్జిస్తుండగా, వినియోగదారులు నష్టపోతున్నారని, ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందని ఆరోపణలు ఉన్నాయి. అక్రమ మార్గంలో ఆర్జించిన సంపదతో ఈ వ్యవస్థ మరింత బలపడుతోందని స్థానికులు అంటున్నారు. ఈ దందా వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలపై సమగ్ర విచారణ జరపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అధికారులకు కనిపించని బెల్ట్‌షాపులు..?

గ్రామాల్లో బహిరంగంగా నడుస్తున్న బెల్ట్ షాపులపై సంబంధిత శాఖలు ఎందుకు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతున్నాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అధికారిక మద్యం దుకాణాల్లో సరుకు నిండుకున్నప్పటికీ, అవే మద్యం బ్రాండ్లు బెల్ట్‌షాపుల్లో ఎలా లభిస్తున్నాయో చెప్పాలని ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు.

భారీ స్థాయిలో మద్యం రవాణా జరుగుతున్నప్పటికీ తనిఖీలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఇది ఎక్సైజ్ శాఖ నిర్లక్ష్యమా.. లేక ఏదైనా సిండికేట్ ప్రభావం వల్లనా అనే చర్చ జరుగుతోంది. ఫిర్యాదులు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ఎటువంటి మార్పు కనిపించకపోవడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అక్రమ మద్యం వ్యాపారానికి సంబంధించిన వాస్తవాలను వెలికితీసేందుకు ప్రత్యేక దాడులు నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కుసుమంచిలో మద్యం అక్రమ వ్యాపార ముఠాలపై కఠిన చర్యలు తీసుకోకపోతే, బెల్ట్ షాపులు పూర్తి స్థాయి మద్యం దుకాణాలుగా మారిపోయే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు.