3-bodies-return : ఇంటిల్లిపాది కంట తడి Andhra Prabha Sad News
3-bodies-return : ఇంటిల్లిపాది కంట తడి Andhra Prabha Sad News
- వియత్నాం మృతదేహాల చేరిక
- బాధితులకు అండగా కూటమి ప్రభుత్వం
- సోమవారం రాత్రి నుంచే ఎయిర్‌పోర్ట్‌లోనే మంత్రి కొండపల్లి
- బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పిన మంత్రి
- ప్రవాసాంధ్రులకు కొండంత అండగా ఏపీఎన్నార్టీ
( అమరావతి, ఆంధ్రప్రభ)

3-bodies-return : వియత్నం పడవ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకుల భౌతికకాయాలు మంగళవారం వారి స్వస్థలాలకు చేరుకున్నాయి. ఉదయం 7.20 గంటలకు ముంబై మీదుగా హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం కార్గో విభాగానికి ఈ మృతదేహాలు చేరుకోగా.. అక్కడ నుంచి ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆంబులెన్స్‌లలో వారి స్వగ్రామాలకు తరలించారు. ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ లావా ఇంటర్నేషనల్ దక్షిణ భారతదేశానికి చెందిన పంపిణీదారులను ప్రోత్సహించే క్రమంలో వీరిని వియత్నాం పర్యటనకు తీసుకువెళ్లింది. శనివారం మధ్యాహ్నం వియత్నాంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతమైన ఫ్యుకాక్ ద్వీపంలో 32 మంది భారతీయ పర్యాటకులతో వెళుతోన్న బోటు బలమైన గాలులు వీయడంతో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కడపకు చెందిన శ్రీధర్, మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, హిందూపురానికి చెందిన రవితేజ మృతిచెందిన సంగతి విదితమే. మృతుల కుటుంబాలకు తక్షణమే సహాయం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి నారా లోకేష్, సూక్ష్మ, చిన్న, మధ్యతరహ పరిశ్రమలు, గ్రామీణ పేదరిక నిర్మూలన, ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీ ఎన్నార్టీ అధికారులు ఎప్పటికప్పుడు ఇండియన్ ఎంబసీ, వియత్నాం ఎంబసీ అధికారులతో మాట్లాడుతూ ప్రమాదం నుంచి బయటపడిన వారిని ఇండియాకు తీసుకువచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక ముగ్గురు పర్యాటకుల మృతదేహాలకు ముంబై విమానాశ్రయంలో అన్ని రకాల చట్టపరమైన లాంఛనాలను వేగంగా పూర్తి చేసి, భౌతికకాయాలను నేరుగా శంషాబాద్‌కు తరలించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సోమవారం రాత్రి 8 గంటలకే ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుని రాత్రంతా ఆయన అక్కడే ఉండి బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పడతో పాటు విమానాశ్రయానికి వచ్చిన భౌతికాయాలను దగ్గరుండి కిందకు దింపించి.. వారి స్వగ్రామాలకు పంపే ఏర్పాట్లు పర్యవేక్షించారు. బాధితులను పరామర్శించి, ప్రభుత్వం వారికి అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. బాధితుల నుంచి పూర్తి వివరాలు, వారి కుటుంబ నేపథ్యం వివరాలు అన్నీ అడిగి మంత్రి తెలుసుకున్నారు.
3-bodies-return : ఏపీఎన్నార్టీతో తెలుగు ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటాం :

ఎయిర్‌పోర్ట్‌లో మంత్రి కొండపల్లి మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకు ఎప్పుడు ఎలాంటి ఆపద వచ్చినా ఏపీఎన్నార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రవాసాంధ్రుల కోసం ప్రభుత్వం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటూ వారికి అండగా ఉంటోందన్నారు. ఇటీవల హాంకాంగ్ విమానాశ్రయంలో పాస్‌పోర్టులు పోగొట్టుకుని ఇబ్బంది పడిన తెలుగు కుటుంబంపై ఐటీ మంత్రి నారా లోకేష్ గారు తక్షణమే స్పందించి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే ఆ కుటుంబానికి ప్రత్యామ్నాయ పాస్‌పోర్టులు ఏర్పాటు చేసి సురక్షితంగా వారు గమ్యస్థానాలకు చేరుకునేలా చేశారని మంత్రి గుర్తు చేశారు. నేపాల్ సంక్షోభ సమయంలోనూ ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడ చిక్కుకున్న తెలుగు పర్యాటకులను ప్రత్యేక విమానాల్లో స్వదేశాలకు రప్పించడంలో ఏపీఎన్నార్టీ కీలక పాత్ర పోషించిందని మంత్రి కొండపల్లి తెలిపారు. ప్రపంచంలో తెలుగు ప్రజలు ఎక్కడ ఏ ఇబ్బందుల్లో ఉన్నా స్పందించి, వారిని ఆదుకునేందుకు మా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
