El Nino Telangana| రైతులకు మంత్రి తుమ్మల కీలక సూచనలు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశాల నేపథ్యంలో రైతులు పంటల సాగులో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈ మేరకు నిర్వహించిన ‘రైతు నేస్తం’ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రైతులతో నేరుగా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఈ ఏడాది తెలంగాణతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోందని తెలిపారు. దీంతో కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని సూచించారు.

భూగర్భ జలాల పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించి రైతులకు సరైన సమాచారం అందించాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖ, భూగర్భ జలాల శాఖ, భారత వాతావరణ శాఖ (IMD) అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ రైతులకు ఎప్పటికప్పుడు సూచనలు అందించాలని మంత్రి పేర్కొన్నారు.

వర్షపాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో జొన్న, సజ్జ, కొర్ర, పెసర, మినుము, కంది వంటి తక్కువ నీటితో సాగు చేయగల పంటలకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. అలాగే శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన తక్కువ కాలంలో పండే, తక్కువ నీరు అవసరమయ్యే అధిక దిగుబడి పంట రకాలను ఎంచుకోవాలని చెప్పారు.

రానున్న మూడు నెలల్లో..

ఈ సందర్భంగా ఐఐఎంఆర్ డైరెక్టర్ మాట్లాడుతూ.. కొర్ర, సజ్జ, జొన్న వంటి చిరుధాన్యాల సాగును మరింత పెంచాలని రైతులకు సూచించారు. భారత వాతావరణ శాఖ (IMD) హైదరాబాద్ సంచాలకురాలు స్టెల్లా మాట్లాడుతూ ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో ఇప్పటివరకు సాధారణం కంటే 30 నుంచి 35 శాతం వరకు తక్కువ వర్షపాతం నమోదైందని తెలిపారు. రానున్న మూడు నెలల్లో కూడా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నందున తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయడం ఉత్తమమని సూచించారు.

ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలి

ఇరిగేషన్ శాఖ అధికారులు మాట్లాడుతూ.. ఎగువ రాష్ట్రాల్లో కూడా వర్షపాతం తక్కువగా ఉండటంతో కృష్ణా, గోదావరి నదుల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందన్నారు. అందువల్ల అందుబాటులో ఉండే నీటిని దృష్టిలో ఉంచుకుని పంటల ప్రణాళిక రూపొందించుకోవాలని రైతులకు సూచించారు. భూగర్భ జలాల శాఖ డైరెక్టర్ జిల్లాల వారీగా భూగర్భ జలాల పరిస్థితిని వివరించారు. రాబోయే రోజుల్లో భూగర్భ జలాల మట్టం మరింత తగ్గే అవకాశం ఉన్నందున వరి, చెరకు వంటి అధిక నీరు అవసరమయ్యే పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన నిపుణులు పాల్గొని ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే పంటల నిర్వహణ, నీటి వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగు, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై రైతులకు పలు కీలక సూచనలు చేశారు.