కాంగ్రెస్ సమావేశంలో రసాభాస.. సర్పంచ్ నిరసన
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ : మంచిర్యాల జిల్లా తాండూరు మండల కేంద్రంలోని బీసీ కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏల సమావేశం ఉద్రిక్తంగా మారింది. సమావేశానికి తనను ఆహ్వానించకపోవడంతో పాటు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో తన ఫొటోను కూడా పెట్టలేదని ఆరోపిస్తూ తాండూరు గ్రామ సర్పంచ్ ముడిమడుగుల సురేష్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి, మండల అధ్యక్షుడు పెద్దబోయిన శంకర్‌ను నిలదీశారు.
తాను దళిత సర్పంచ్‌నని, ఉద్దేశపూర్వకంగానే అవమానించారని ఆరోపిస్తూ సభలోనే నిరసన వ్యక్తం చేశారు. ఈ ఘటనతో సమావేశంలో కొంతసేపు గందరగోళం నెలకొంది.
మాదారం–3 ఇంక్లైన్, కిష్టంపేట, బోయపల్లి, కాజీపేట, కొత్తపల్లి గ్రామాల సర్పంచులకు కూడా సమాచారం ఇవ్వలేదని ఆరోపించిన సురేష్, తన అనుచరులు, కార్యకర్తలతో కలిసి సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని ఆయన విమర్శించారు.
‘ఇది పార్టీ సమావేశం.. ప్రోటోకాల్ ఉండదు’
ఈ ఘటనపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి స్పందిస్తూ, ఇది పార్టీ బీఎల్‌ఏల సమావేశమని, ఇలాంటి సమావేశాలకు ప్రభుత్వ ప్రోటోకాల్ వర్తించదని తెలిపారు.
పాత్రికేయులతో వాగ్వాదం
సమావేశంలో జరిగిన పరిణామాలను చిత్రీకరిస్తున్న పాత్రికేయులతో కూడా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. “మీడియాకు అనుమతి లేదు.. ఎందుకు వచ్చారు.. ఫొటోలు తీయొద్దు” అంటూ అభ్యంతరం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.
