పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. ఐదుగురు అరెస్ట్

టేకుమట్ల, ఆంధ్రప్రభ : భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం సుబ్బక్కపల్లి గ్రామ శివారులోని స్మశానవాటిక సమీపంలో పేకాట ఆడుతున్న వారిపై పోలీసులు ఆకస్మికంగా దాడి నిర్వహించి ఐదుగురిని అరెస్ట్ చేశారు.

విశ్వసనీయ సమాచారం మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నగదు పెట్టుకుని పేకాట ఆడుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వారిలో జంగటి లక్ష్మయ్య, బొడ్డు ఒదేలు, బొడ్డు శ్రీకాంత్, కుర్రె సురేష్, రాసమల్లు కుమారస్వామి ఉన్నారు. వారి వద్ద నుంచి పేకాటకు ఉపయోగిస్తున్న నగదును స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఈ సందర్భంగా ఎస్‌ఐ అమూల్య మాట్లాడుతూ, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.