E20 | ఖరీఫ్ సీజన్లోనూ చెరకు సాగులో సరికొత్త రికార్డు!
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: దేశంలో E20 వినియోగం పెరగడం.. E20 తయారీలో ఇథనాల్ ఉత్పత్తికి చెరకు కీలక ముడిపదార్థంగా కావడంతో రైతులు చెరుకు పంట పండించేందుకు ఆసక్తిని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఖరీఫ్ పంటల సాగు విస్తీర్ణంలో తగ్గుదల స్పష్టంగా కనిపిస్తున్నా.. చెరుకు సాగు మాత్రం భిన్నంగా మారి ట్రెండ్‌ను నమోదు చేస్తోంది.
కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. జూలై 10 నాటికి దేశంలో చెరకు సాగు విస్తీర్ణం 57.5 లక్షల హెక్టార్లకు చేరింది. గత ఏడాది ఇదే సమయానికి 56.7 లక్షల హెక్టార్లలో చెరకు సాగు నమోదైంది. అంటే ఏడాది ప్రాతిపదికన చెరకు విస్తీర్ణంలో స్వల్ప పెరుగుదల కనిపించింది. మరోవైపు, దేశవ్యాప్తంగా మొత్తం ఖరీఫ్ సాగు విస్తీర్ణం ఈ సీజన్లో తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వర్షపాతం పరిస్థితులు, ప్రాంతాలవారీగా మారుతున్న సాగు పరిస్థితుల మధ్య కూడా చెరకు విస్తీర్ణం పెరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.
E20 పెట్రోల్ ప్రధాన కారణామా..?
ఈ మార్పు వెనుక E20 పెట్రోల్ విధానం కూడా ఒక కారణంగా భావిస్తున్నారు. పెట్రోల్‌లో 20 శాతం వరకు ఇథనాల్ మిశ్రమాన్ని ప్రోత్సహిస్తున్న నేపథ్యంలో దేశంలో ఇథనాల్ అవసరాలు పెరుగుతున్నాయి. చెరకు, మొలాసిస్ వంటి వాటి నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసే అవకాశం ఉండటంతో చెరకు పంటకు దీర్ఘకాలంలో డిమాండ్ కొనసాగుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఇథనాల్ మార్కెట్ విస్తరణతో చెరకు రైతులకు కొత్త అవకాశాలు ఏర్పడవచ్చని వ్యవసాయ వర్గాలు భావిస్తున్నాయి. అయితే చెరకు అధిక నీటి అవసరం ఉన్న పంట కావడంతో సాగు విస్తీర్ణం పెరుగుదలతో పాటు నీటి వినియోగం, ప్రాంతీయ వాతావరణ పరిస్థితులు, రైతులకు లభించే ధర వంటి అంశాలు కూడా కీలకంగా మారనున్నాయి.
మొత్తంగా చూస్తే.. E20 లక్ష్యాలు, పెరుగుతున్న ఇథనాల్ అవసరాల నేపథ్యంలో చెరకు సాగుపై రైతుల ఆసక్తి కొనసాగుతున్నట్లు తాజా గణాంకాలు సూచిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇథనాల్ డిమాండ్ మరింత పెరిగితే చెరకు సాగు, రైతుల ఆదాయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరంగా మారనుంది.
