Jananayagan |’సిగ్మా’ సినిమా వాయిదా?
ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నటించిన ‘జననాయగన్’ సినిమా ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను ఈ నెల 24న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ఇప్పటికే ప్రకటించింది. ఇదిలా ఉండగా.. విజయ్ కుమారుడు జేసన్ సంజయ్ దర్శకుడిగా ‘సిగ్మా’ అనే సినిమాను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా జూలై 31న విడుదల కావాల్సి ఉంది. కానీ, తన తండ్రి విజయ్ ‘జననాయగన్’ సినిమాను దృష్టిలో పెట్టుకుని జేసన్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
తాను దర్శకత్వం వహించిన తొలి సినిమా ‘సిగ్మా’ను వాయిదా (పోస్ట్‌పోన్) వేయాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాను జూలై 31న కాకుండా.. ఆగస్టులో విడుదల చేయాలని జేసన్ అనుకుంటున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. తండ్రి సినిమా కోసం కొడుకు తన సినిమా విడుదలను వాయిదా వేసుకోవడం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. గతంలో విజయ్, జేసన్ తల్లి విడాకుల వివాదం సమయంలో.. జేసన్ తన తండ్రి పేరును తొలగించిన విషయం తెలిసిందే.
అలాంటిది ఇప్పుడు తన తండ్రి సినిమా కోసం జేసన్ సంజయ్ తన సినిమాను వాయిదా వేయాలని అనుకోవడం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, జేసన్ సంజయ్ తెరకెక్కిస్తున్న ‘సిగ్మా’ చిత్రంలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. జేసన్‌కు ఇది మొదటి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలే ఉన్నాయి.
