43 మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
రేగొండ, ఆంధ్రప్రభ : భూపాలపల్లి నియోజకవర్గంలోని రేగొండ, గోరుకొత్తపల్లి మండలాలకు చెందిన 43 మంది కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మంగళవారం రేగొండ రైతు వేదికలో చెక్కులను పంపిణీ చేశారు.
రేగొండ మండలానికి చెందిన 32 మంది లబ్ధిదారులకు రూ.32,03,712, గోరుకొత్తపల్లి మండలానికి చెందిన 11 మందికి రూ.11,01,276 అందజేశారు. మొత్తం 43 మంది లబ్ధిదారులకు రూ.43,04,988 విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుకు ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటోందన్నారు. సన్నబియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని తెలిపారు.
గ్రామాల్లో భూ సమస్యల పరిష్కారం కోసం సర్వేలు నిర్వహించి, హద్దుల నిర్ధారణతో పాటు అర్హులకు పట్టాలు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వారణాసి మౌనిక, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, తహసీల్దార్లు శ్వేతారావు, హేమ, డిప్యూటీ తహసీల్దార్లు అబ్దుల్ రజాక్, రాజ్యలక్ష్మి, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.
