పత్తి పంటను పరిశీలించిన జిల్లా వ్యవసాయ అధికారిణి
ఎల్నినో పరిస్థితుల్లో రైతులకు శాస్త్రీయ సూచనలు
గోనెగండ్ల (ఆంధ్రప్రభ): మండలంలోని హెచ్. కైరవాడి గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారిణి పి.ఎల్. వరలక్ష్మి, ఎమ్మిగనూరు వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్.ఎం.డి. ఖాద్రి, కృషి విజ్ఞాన కేంద్రం బనవాసి కార్యక్రమ సమన్వయకర్త డా. కె. రాఘవేంద్ర చౌదరి, మండల వ్యవసాయ అధికారి హేమలత సంయుక్తంగా పత్తి పంటను పరిశీలించారు. ఎల్నినో ప్రభావంతో కొనసాగుతున్న బెట్ట పరిస్థితుల నేపథ్యంలో రైతులకు పంట సంరక్షణపై శాస్త్రీయ సూచనలు అందించారు.
బెట్ట పరిస్థితుల కారణంగా పత్తి పంటలో పచ్చదోమ, తెల్లదోమ, పెనుబంక పురుగులు, తామర పురుగుల ఉధృతి పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. నివారణకు పసుపు, నీలం రంగు జిగురు ట్రాప్లను ఏర్పాటు చేయాలని, నీటిలో కరిగే ఎరువులు లేదా నానో యూరియాను ఆకులపై పిచికారీ చేయాలని సూచించారు. అలాగే వేపనూనె లేదా అవసరమైతే సూచించిన పురుగుమందులను మార్చి మార్చి పిచికారీ చేయాలని, రైతులు వ్యవసాయ శాఖ, కృషి విజ్ఞాన కేంద్రం సూచించిన సమగ్ర పంట సంరక్షణ (ఐసీఎం) పద్ధతులను పాటిస్తే బెట్ట పరిస్థితుల ప్రభావాన్ని తగ్గించి మెరుగైన దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.
