పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు
ప్రజాసేవను మరింత ఉత్సాహంగా కొనసాగించాలని ఆకాంక్షించిన ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం బ్యూరో (ఆంధ్రప్రభ): భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ భీమవరం శ్రీరాంపురంలోని సుబ్బారాయుడు ఆలయంలో మంగళవారం జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సుబ్రహ్మణ్య స్వామివారికి అభిషేకాలు నిర్వహించి పవన్ కల్యాణ్ ఆరోగ్యంపై ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) మాట్లాడుతూ పవన్ కల్యాణ్ త్వరగా కోలుకుని మరింత ఉత్సాహంతో ప్రజాసేవను కొనసాగించాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు. శస్త్రచికిత్స విజయవంతం కావడం సంతోషకరమని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, ఆలయ ఈవో, అర్చకులు, పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.
