కిస్తాపూర్‌లో గంజాయి రాకెట్ బట్టబయలు

ఒడిశా యువకుడి అరెస్ట్.. రూ. లక్ష విలువైన గంజాయి స్వాధీనం

మేడ్చల్ (ఆంధ్రప్రభ): మేడ్చల్ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న గంజాయి విక్రయాల నెట్‌వర్క్‌ను పోలీసులు ఛేదించారు. ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి కిస్తాపూర్‌లో విక్రయిస్తున్న ఒడిశాకు చెందిన అలోక్ సర్కార్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి సుమారు రూ.లక్ష విలువైన రెండు కిలోల గంజాయి, ఒక మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.

పోలీసుల కథనం ప్రకారం.. కిస్తాపూర్‌లో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న అలోక్ సర్కార్ అదనపు ఆదాయం కోసం గంజాయి విక్రయాలను ఎంచుకున్నాడు. తన స్నేహితుడు సోహైల్ సహకారంతో ఒడిశా నుంచి గంజాయిని తెప్పించి స్థానికంగా విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. నమ్మదగిన సమాచారం మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న సోహైల్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు, ఈ రాకెట్‌కు సంబంధించిన ఇతర లింకులపై కూడా దర్యాప్తు కొనసాగుతున్నట్లు మేడ్చల్ సీఐ సత్యనారాయణ తెలిపారు.