Breaking | గూడ్స్ కింద పడి.. ఓ కుటుంబం ఆత్మహత్య..

ఆంధ్రప్రభ, ప్రకాశం : ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సింగరాయకొండలో గూడ్స్ రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. రెండో నెంబర్ ప్లాట్ ఫామ్ పై వెళుతున్న రైలు కిందపడి ఇద్దరు పిల్లలతో సహా భార్యాభర్త ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతుల్లో దంపతులతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం నెలకొంది.

మృతుని దగ్గర ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ ఆధారంగా మృతులు నెల్లూరు జిల్లా గూడూరు మండలం ఆర్వీ కండ్రిగ, తోటపల్లి గూడురుకు చెందిన హరికృష్ణ కుటుంబంగా గుర్తించారు. ఇద్దరు చిన్నారులు సహా భార్యాభర్తలు ఆత్మహత్య చేసుకోవటానికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. సమీప ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలిస్తున్నారు. అలాగే హరికృష్ణ గ్రామానికి సమాచారం పంపి ఇతర వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు.