Palnadu Tragedy | ఇద్దరు చిన్నారులను చంపి.. తల్లి ఆత్మహత్య

Palnadu Tragedy | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామంలో భారతి అనే మహిళ తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలిలో ఒక సూసైడ్ లెటర్ లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. అందులో “నా చావుకు ఎవరూ కారణం కాదు” అని భారతి రాసినట్లు సమాచారం. అయితే ఆ లేఖలోని అంశాల ప్రామాణికతను పోలీసులు పరిశీలిస్తున్నారు.

ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? కుటుంబ, ఆర్థిక లేదా ఇతర వ్యక్తిగత సమస్యలు ఏమైనా ఉన్నాయా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను విచారిస్తూ వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ ఆధారాలు, సూసైడ్ లెటర్ పరిశీలన అనంతరం ఘటనకు గల అసలు కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.