వంశధార కాలువ గండిపై మంత్రి అచ్చెన్నాయుడు ఆగ్రహం..

అధికారుల నిర్లక్ష్యంపై వ్యవసాయ శాఖ మంత్రి మండిపాటు
యుద్ధప్రాతిపదికన పూడ్చివేత పనులు చేపట్టాలని ఇరిగేషన్ అధికారులు ఆదేశం
ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక

కోటబొమ్మాళి శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : శ్రీకాకుళం జిల్లా రైతాంగానికి ప్రధాన సాగునీటి వనరైన వంశధార ఎడమ ప్రధాన కాలువకు సారవకోట మండలం గుమ్మపాడు గ్రామం అక్కివలస పరిధిలో గండి పడిన ఘటనపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై రైతులు సాగు పనుల్లో నిమగ్నమైన ఇలాంటి తరుణంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల కాలువకు గండి పడటం ఏమాత్రం సమర్థనీయం కాదని ఆయన స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా వ్యవహరించే అధికారులపై ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్ష చూపబోదని తేల్చిచెప్పారు.

కాలువకు పడిన గండిని తక్షణమే యుద్ధప్రాతిపదికన పూడ్చివేసి, సాగునీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా పునరుద్ధరించాలని సంబంధిత ఇరిగేషన్ ఇంజినీర్లను మంత్రి ఆదేశించారు. పనులు పూర్తయ్యే వరకు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి ప్రత్యక్ష పర్యవేక్షణ చేపట్టాలని, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. ఖరీఫ్ సీజన్‌లో ప్రతి నీటి చుక్కా రైతుల పొలాలకు చేరేలా ఇరిగేషన్ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. కాలువల నిర్వహణ, బలహీన ప్రాంతాల గుర్తింపు, ముందస్తు మరమ్మతులు, నిరంతర తనిఖీలు చేపట్టడంలో అధికారులు విఫలం కావడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని, ఇకపై నిరంతర నిఘా తప్పనిసరని మంత్రి స్పష్టం చేశారు

ప్రధాన కాలువలతో పాటు శాఖ కాలువలు, చెరువుల గట్లు, నీటి నిల్వ నిర్మాణాలన్నింటినీ ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. రైతుల ప్రయోజనాలే ఈ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని, సాగునీటి నిర్వహణలో అలసత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బాధ్యులైన అధికారులపై కఠినంగా శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్ర హెచ్చరికలు చేశారు..