ప్రమాదంగా ఎల్కతుర్తి–దామెర రహదారి

  • NH 765DGపై వెంటనే పనులు పూర్తి చేయాలి
  • భద్రతా చర్యలు లేక వాహనదారుల ప్రాణాలకు ముప్పు..
  • నిర్లక్ష్యంపై విచారణకు డిమాండ్
  • బీజేపీ మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్

ఎల్కతుర్తి, ఆంధ్రప్రభ : హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం నుంచి దామెర గ్రామానికి వెళ్లే జాతీయ రహదారి-765DGపై చేపట్టిన డ్రైనేజీ నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోవడంతో రహదారి అత్యంత ప్రమాదకరంగా మారిందని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆందోళన వ్యక్తం చేశారు.

రోడ్డు పక్కన లోతైన గుంతలు తవ్వి.. పనులను అసంపూర్తిగా వదిలేయడంతో వాహనదారులు, పాదచారులు నిత్యం ప్రమాదకర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తోందన్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, రక్షణ బ్యారికేడ్లు లేకపోవడంతో ప్రమాదాల ముప్పు మరింత పెరిగిందని పేర్కొన్నారు.

డ్రైనేజీలో మురుగు నీరు నిల్వ ఉండటంతో దుర్వాసన వ్యాపించడంతో పాటు దోమలు విపరీతంగా పెరిగి ప్రజారోగ్యానికి కూడా ముప్పుగా మారిందన్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి జాతీయ రహదారి అధికారుల పర్యవేక్షణ లోపమే కారణమా? లేక పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నిర్లక్ష్యమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని శ్రీకాంత్ యాదవ్ అన్నారు.

కోట్లాది రూపాయల ప్రజాధనంతో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు, భద్రతా నిబంధనలు పాటించకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీ పనులను పూర్తి చేయడంతో పాటు రహదారిని పూర్తిస్థాయిలో మరమ్మతు చేసి ప్రజలకు సురక్షితమైన ప్రయాణ సౌకర్యం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.

అలాగే నిర్లక్ష్యానికి బాధ్యులైన అధికారులు, కాంట్రాక్టర్‌పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. సమస్యను వెంటనే పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ హెచ్చరించారు.